నందిపేట్, అక్టోబర్ 29: నా జీవితం ప్రజా సేవకే అంకితమని, పదేండ్ల శ్రమను గుర్తించి మళ్లీ ఆశీర్వదించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. నందిపేట మండలంలోని మల్లారం, కంఠం, అయిలాపూర్, ఆంధ్రానగర్ గ్రామాల్లో ఆదివారం ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమమే నా ప్రచార అస్ర్తాలని, నాపై పోటీకి ప్రజల మధ్య చిచ్చు పెట్టే మాయగాళ్లు వస్తున్నారని, వారి మాయలో పడొద్దని ప్రజలను కోరారు. ఓటు ఆయుధంతో ఆరాచకశక్తుల ఆట కట్టించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలు నీతీనియమం లేని పార్టీలని విమర్శించారు. తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని, మూడోసారి బీఆర్ఎస్దే విజయమన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు వంటి అనేక వర్గాలకు చెందిన వారికి రూ.2016, దివ్యాంగులకు రూ.4016ల చొప్పున ఆసరా పింఛన్లు ఇస్తున్నట్లు వివరించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమీ, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు తదితర పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ పేద ప్రజల పక్షపాతిగా చరిత్రకెక్కారని జీవన్‌రెడ్డి కొనియాడారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, బీఆర్ఎస్ మండల నాయకులు పాల్గొన్నారు.

మతం పేరుతో ప్రజల మధ్య మంట పెట్టే గుజరాత్ గులాంలను, గాంధీల ఇంటి చుట్టూ తిరుగుతూ ఢిల్లీకి సలాం కొట్టేవాళ్లను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మనది తెలంగాణ ఆత్మ గౌరవపోరు అని, కారుజోరుని ఎవరూ ఆపలేరని అన్నారు. ఆర్మూర్‌పై అరాచక శక్తుల కన్ను పడిందని, అభివృద్ధి నిరోధక, అవినీతికర మూకలు రకరకాల పార్టీల ముసుగులో దాడికి వస్తున్నారని, వాళ్లకు ఓటేస్తే మనల్ని కాటేస్తారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీల నీడ కూడా ఆర్మూర్‌పై పడొద్దన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని తలచే బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.