సుభాష్‌నగర్, ఫిబ్రవరి 13: చదువుల తల్లి సరస్వతి దేవీ జన్మతిథి పంచమి పురస్కరించుకొని బుధవారం జిల్లాలో వివాహాలు, అక్షరాభ్యాసాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోటగల్లి మార్కండేయ మందిరం, సరస్వతి శిశుమందిర్, న్యాల్కల్రోడ్ లలితాదేవి ఆశ్రమాలయం, భవానీనగర్ తుల్జాభవానీ… తదితర దేవీ ఆలయాలు ముస్తాబయ్యాయి.
సరస్వతీదేవిని మాఘ పంచమి రోజు శ్రీపంచమి పేరిట ఆరాధించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. వసంతపంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే జ్ఞానరాశులు అవుతారని ప్రతీతి. సరస్వతీమాత ఆరాధనతో వాక్శుద్ధి, జ్ఞానాభివృద్ధి, సత్బుద్ధి, మేథా సంపద, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ… తదితర శుభాలు కలిగి భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత విద్యలో రాణిస్తారని విశ్వాసం. వాగీశ్వరీ, మహాసరస్వతి, సిద్ధ సరస్వతి, నీల సరస్వతి, ధారణాసరస్వతి, బాల సరస్వతి రూపాల్లో చదువుల తల్లిని తెల్లనిపూలతో పూజించడంతో సకల విద్యలు నేర్చుకుంటారని పురాణ వచనం.
తిథులలో పంచమి, వారాలలో బుధవారం, నక్షత్రాలలో రేవతి, గృహ, వివాహ కార్యాలకు అత్యంత అనుకూలమైన శుభముహూర్తం వసంత పంచమి. దీంతో బుధవారం జిల్లాలో వందలాది వివాహాలు జరగనున్నాయి. రైల్వేస్టేషన్, బస్టాండ్ కల్యాణమండపాలు పెండ్లిళ్ల సందడితో కిటకిటలాడుతున్నాయి.