వినాయక్‌నగర్, నవంబర్ 1: ప్రజల విసృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈనెల 15వ తేదీన స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్పర్సన్ జీవీఎన్ భరతలక్ష్మి తెలిపారు. జిల్లా కోర్టులోని తన చాంబర్లో నిజామాబాద్ సీపీ సాయి చైతన్య, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్‌భాస్కర్ రావుతో కలిసి శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంతోపాటు ఆర్మూర్, బోధన్ కోర్టు ప్రాంగణాల్లో కూడా ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా రాజీపడదగిన 1,328 క్రిమినల్ కేసులను గుర్తించామన్నారు. ప్రజల న్యాయపరమైన వివాదాలు, రాజీ పద్ధతిలో త్వరగా పరిష్కరించుకోవడానికి న్యాయసేవల చట్టం ఉత్తమమని తెలిపారు.