కోటగిరి/ రుద్రూర్, డిసెంబర్ 26 : నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని బోధన్ ఏసీపీ కిరణ్‌కుమార్ సిబ్బందికి సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కోటగిరి, రుద్రూర్ పోలీస్స్టేషన్లను ఆయన సోమవారం తనిఖీ చేశారు. మహారాష్ట్రకు కోటగిరి మండలం సరిహద్దులో ఉన్నందున పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఆయా స్టేషన్లలోని రికార్డులను పరిశీలించారు. ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారో ఎస్సై మశ్చేందర్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో క్రైం రేటుపై ఆరా తీశారు. అనంతరం పోలీస్ సిబ్బందితో సమీక్షించి పలు సూచనలు చేశారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అనంతరం కోటగిరి పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. పోలీస్‌స్టేషన్ పరిసరాలు మొక్కలతో ఆహ్లాదకరంగా ఉండడంతో పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఆయాస్టేషన్ల సిబ్బంది పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఏసీపీ వెంట కోటగిరి, రుద్రూర్ ఎస్సైలు మశ్చేందర్‌రెడ్డి, రవీందర్, కోటగిరి ఏఎస్సై శ్రీనివాస్‌గౌడ్, సిబ్బంది సురేశ్ తదితరులు ఉన్నారు.
విజేతలకు బహుమతుల ప్రదానం
రుద్రూర్, డిసెంబర్ 26 : లయన్స్‌క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రెండు రోజుల పాటు నిర్వహించిన షార్ట్ బౌండరీ క్రికెట్ టోర్నమెంట్ సోమవారంతో ముగిసింది. విజేతగా సాయికుమార్ జట్టు, రన్నర్‌గా అన్సార్ జట్టు నిలిచింది. విన్నర్ జట్టుకు రూ.4,444, రన్నర్ జట్టుకు రూ.2,222తో పాటు ట్రోఫీలను ఏసీపీ కిరణ్ కుమార్ అందజేశారు. కార్యక్రమంలో ఇందూర్ విద్యాసంస్థల అధినేత కిశోర్, విద్యావికాస్ జూనియర్ కళాశాల అధినేత శ్రీనివాస్, సూర్యనారాయణ, ఆదినారాయణ, శ్రీనివాస్‌రాజు, శ్యాంసుందర్ పహాడే, లంక రవి, ప్రవీణ్ కుమార్, జమీల్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.