కోటగిరి/రుద్రూర్/మోస్రా(చందూర్)/ బాల్కొండ/ మెండోరా/ మోర్తాడ్, నవంబర్ 26 : 18 ఏండ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు నమోదు కల్పించేందుకు జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో బీఎల్వోలు, అంగన్వాడీ టీచర్లు, వీఆర్ఏలు శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
కోటగిరి మండలంలోని అన్ని పోలింగ్ బూత్‌లలో బీఎల్వోలు జయశ్రీ, బాలలక్ష్మి తదితరులు యువత నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. కోటగిరిలోని పలు పోలింగ్ బూత్‌లను బాన్సువాడ నియోజకవర్గ ఎలక్టోరల్ ఆఫీసర్ చందర్‌నాయక్ పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయని బీఎల్వోలను అడిగి తెలుసుకున్నారు. ఓటు హక్కు నమోదుపై గ్రామాల్లో దండోరా వేయించి అవగాహన కల్పించాలన్నారు. ఆదివారం కూడా అన్ని గ్రామాల్లో బీఎల్వోలు అందుబాటులో ఉంటారని, యువత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం రుద్రూర్‌లోని ఓటరు నమోదు కేంద్రాలను పరిశీలించారు.ఆయన వెంట కోటగిరి తహసీల్దార్ శ్రీకాంత్‌రావు ఉన్నారు. రుద్రూర్ తహసీల్దార్ ముజీబ్, ఎంపీడీవో బాలగంగాధర్, ఎంపీవో సాయిలు, కార్యదర్శి విఠల్‌రెడ్డి, ఏపీవో భాస్కర్ తదితరులు ఉన్నారు.
పొతంగల్ మండల కేంద్రంలోని పోలింగ్ బూత్‌ను సర్పంచ్ వర్ని శంకర్ పరిశీలించారు. యువత ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని అన్నారు.
మోస్రా మండలంలోని చింతకుంట ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం శ్రీనివాస్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
బాల్కొండ మండల కేంద్రంలో ఓటరు నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆటో ద్వారా ప్రచారం చేశారు. ఉపసర్పంచ్ షేక్వాహబ్, జీపీ కార్యదర్శి నల్లగంటి నర్సయ్య, వార్డు మెంబర్ పాల్గొన్నారు.
మెండోరా తహసీల్దార్ సతీశ్‌రెడ్డి ఓటర్లకు సూచించారు. శనివారం మండలంలో బూత్‌స్థాయి అధికారి అందించే సేవలను గ్రామాలకు వెళ్లి పరిశీలించారు. పోచంపాడ్ గ్రామంలో ఓటర్లతో మాట్లాడారు. సర్పంచ్ మిస్బా, ఆర్ఐ సాయగౌడ్, సెక్రటరీ భోజన్న, అంగన్వాడీ టీచర్లు విజయ, సుగుణ, వార్డు మెంబర్ కరీమ్ తదితరులు పాల్గొన్నారు.
ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి
మోర్తాడ్, నవంబర్26: ఓటరుకార్డు లేని వారు ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని, కార్డు ఉన్న వారు ఆధార్‌కార్డుకు లింక్ చేసుకోవాలని తహసీల్దార్ బావయ్య అన్నారు. శనివారం దొన్కల్ గ్రామంలో పోలింగ్‌బూత్ కేంద్రంలో ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. ఓటరుకార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆదివారం సాయంత్రం 5గంటల వరకు సమయం ఉన్నదని, యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.