నిజామాబాద్ క్రైం, ఆగస్టు 3 : ప్రమాదాలను నివారించేందుకు పోలీసు శాఖ చర్యలు తీసుకుంటున్నది. రాంగ్ రూట్లో వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించడంతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు పోలీసు శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా ఇన్చార్జి సీపీ ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టారు. ముందుగా రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేసే వారిపై దృష్టి సారించారు. సీపీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, సీఐ చందర్ రాథోడ్ ఆధ్వర్యంలో రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. నగరంలోని ప్రధాన జంక్షన్స్ వద్ద అపోజిట్ డైరెక్షన్లో వచ్చే వాహనాలను పట్టుకొని ఫైన్స్ విధిస్తున్నారు.
ఇందులో భాగంగా నగరంలోని ప్రభుత్వ దవాఖాన ఎదురుగా, ఖలీల్‌వాడి చౌరస్తా, ప్రగతి దవాఖాన, నిఖిల్‌సాయి చౌరస్తా, దేవీరోడ్డు చౌరస్తా, గాంధీ చౌక్, న్యాల్కల్ రోడ్డు చౌరస్తా ల వద్ద రాంగ్ రూట్లో వచ్చే వాహనాలను పట్టుకొని వారికి జరిమానా విధిస్తున్నారు. రాంగ్ రూట్లో వచ్చే వెహికిల్ ను పట్టుకొని వారికి పోలీసులు తమ వద్ద సిబ్బంది ట్యాబ్ ద్వారా జరిమానాలు విధిస్తున్నారు. రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేసే వారికి రూ. వెయ్యి జరిమానా విధిస్తున్నారు. అయితే ఈ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించిన నాటి నుంచి ప్రతి రోజు సుమారు 50 కేసులు నమోదు చేస్తున్నారు.
దీంతో ప్రతి రోజూ సగటున రూ.50 వేల వరకు జరిమానాలు విధిస్తున్నారు. డ్రైవ్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు సుమారు రూ.20 లక్షల వరకు ఫైన్స్ విధించారు.