బాన్సువాడ టౌన్, జూన్ 22: అమరవీరుల త్యాగాలతోనే ప్రత్యేక తెలంగాణ ప్రతిఫలాలు అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని బాన్సువాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రముఖ పాత్ర, ఉన్నత స్థానం అమరవీరులదేనని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో వేల మంది ప్రాణాలను త్యాగం చేశారని, ముఖ్యంగా విద్యార్థులు ప్రాణాలను వదిలారని గుర్తుచేశారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారని, అందులో భాగంగానే ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు రూ.10 లక్షల ఆర్థికసాయం, సొంతిల్లు లేనివారికి డబుల్ బెడ్రూం ఇంటిని అందజేశారన్నారు. బలిదానాలతో వచ్చిన తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకోవాలని స్పీకర్ పోచారం సూచించారు. అప్పుడు ఆంధ్రా పాలకులు తెలంగాణకు శత్రువులైతే, ఇప్పుడు ఇంటి దొంగలు తెలంగాణను దోచుకోడానికి చూస్తున్నారని అన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్రా పాలకులు పేపర్ల మీద లెక్కలు చూపిస్త్తూ ప్రభుత్వ పథకాల పేరిట కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఒక్క బాన్సువాడ మండలంలోనే 2,728 ఇందిరమ్మ ఇండ్లను నిర్మించామని దోచుకున్నారని, కాగితాల మీద లెక్కలు చూపిన ఇండ్లు ఎక్కడున్నాయని స్పీకర్ అసహనం వ్యక్తంచేశారు. తెలంగాణ బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటుంటే చూడలేక తనతో ఎవరు వచ్చినా, రాకపోయినా టీడీపీకి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనేందుకు ఆ రోజుల్లో నిర్ణయం తీసుకున్నానని స్పీకర్ గుర్తుచేశారు. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలంటే బంగారు తెలంగాణ నిర్మాణం కావాలని, ప్రతి ఇల్లూ సంతోషంగా ఉండాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా కృషి చేయాలని స్పీకర్ పోచారం సూచించారు. అనంతరం బాన్సువాడ మండలం కొత్తాబాది, సోమేశ్వర్ గ్రా మాలకు చెందిన అమరవీరుల కుటుంబసభ్యులను సన్మానించారు. ఎందరో అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమని గురుకుల విద్యార్థిని స్పూర్తి వివరించిన తీరు అందరినీ ఆలోచింపజేసింది. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, బాన్సువాడ పురపాలక సంఘం చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, బాన్సువాడ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ సంగ్రాం నాయక్, ఆత్మకమిటీ చైర్మన్ మో హన్ నాయక్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
గర్వంగా ఉన్నది..
తెలంగాణ కోసం నా కొడుకు అమరుడైనందుకు గర్వంగా ఉంది. నా కొడుకు చనిపోయినా, ఈ రోజు ప్రత్యేక రాష్ట్రం సాధించుకొని ఆనందంగా ఉన్న ప్రతి ఒక్కరి రూపంలో నా కొడుకును చూసుకుంటున్న. నా చిన్న కొడుక్కి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లు ప్రభుత్వ ఉద్యోగంతోపాటు రూ.10లక్షల నగదును స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సార్ అందజేశారు.
– రవీందర్, అమరవీరుడి తండ్రి, కొత్తాబాది