బాన్సువాడ టౌన్/బాన్సువాడ, ఏప్రిల్ 24: బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బాన్సువాడలో మంగళవారం నిర్వహించనున్న నియోజకవర్గ స్థాయి మినీ ప్లీనరీ సమావేశానికి పార్టీ శ్రేణులు తరలిరావాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. సమావేశాన్ని పట్టణంలోని ఎస్ఎంబీ ఫంక్షన్‌హాలులో నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను స్పీకర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి తదితర అంశాలపై పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో 10 నుంచి 15 తీర్మానాలు ప్రవేశపెడతామన్నారు. తీర్మానాలపై చర్చ జరిపి ఆమోదం తెలిపి పార్టీ అధినాయకత్వానికి పంపుతామన్నారు. సమావేశానికి నియోజకవర్గ పరిధి నుంచి సుమారు పదివేల మంది వరకు కార్యకర్తలు వచ్చే అవకాశం ఉన్నదని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సూచించారు. వాహనాల పార్కింగ్, భోజనం, తాగునీటి వసతి ఏర్పాటు చేయాలన్నారు. ఎండాకాలం దృష్ట్యా మజ్జిగ అందుబాటులో ఉంచాలని నాయకులకు సూచించారు. కార్యకర్తలు వారి స్వగ్రామం నుంచి బయల్దేరినప్ప టి నుంచి తిరిగి చేరుకునే వరకు వారిని జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన బాధ్యత మనమందరం తీసుకోవాలన్నా రు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత బాన్సువాడ నియోజకవర్గానికి వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా రూ. 11వేల కోట్ల నిధులు వచ్చినట్లు సభాపతి పోచారం తెలిపారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదన్నారు. కేంద్రం ఏటా తెలంగాణకు రూ. 6 వేల కోట్లు ఇవ్వాలని, ఇప్పటిదాకా కలిపి కేంద్రం నుంచి రూ.30 వేల కోట్లు రావాలన్నారు. కానీ ఇవ్వకుండా సతాయిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చుకోవాలంటే రైతుల కరెంటు మోటర్లకు మీటర్లు పెట్టాలని షరతులు పెడుతున్నాదని ఆరోపించారు. నిధులు ఇవ్వకుండా, అప్పులు రాకుండా అడ్డుకోడం సిగ్గుచేటన్నారు. నిధులు ఇవ్వకుండా వేధిస్తున్నా సీఎం కేసీఆర్ ధైర్యం గల నాయకుడని, రాష్ర్టాన్ని అభివృద్ధి బాట పట్టించారని స్పీకర్ ప్రశంసించారు. నిత్యావసరాల ధరలు పెంచిన కేంద్రం పేదల పొట్ట కొడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.400 ఉన్న సిలిండర్ ధర రూ.1200లకు, రూ.70 ఉన్న పెట్రోల్ రేటు రూ.120కి చేరిందన్నారు. పప్పులు, ఉప్పుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, యావత్ దేశం బీఆర్ఎస్ పాలన కోసం ఎదురుచూస్తుందని తెలిపారు. పక్కనే ఉన్న మహారాష్ట్ర లో బీఆర్ఎస్ పార్టీలోకి ప్రేమ, ఆదరణతో భారీగా చేరుతుండడమే ఇందుకు నిదర్శనమన్నారు. దేశంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో కొత్త పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చి యువతను మోసం చేసిందని విమర్శించారు. కేంద్రంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఒక్క నోటిఫికేషన్‌కు కూడా దిక్కులేదని, కానీ పెద్దపెద్ద మాటలు మాట్లాడతారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఇప్పటికే 2.50 లక్షల ఉద్యోగాలు భర్తీ అయ్యాయని, ఇంకా ఇస్తూనే ఉన్నారని వివరించారు. గ్రామీణ ప్రాంత ప్రజల కోసం తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని, వివక్ష మాని తెలంగాణకు మంచి చేసే పనులు చేయాలని హితవు పలికారు. లేకపోతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. స్పీకర్ వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, బీఆర్ ఎస్ నాయకులు ఎజాస్, దొడ్ల వెంకట్రాం రెడ్డి, గోపాల్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు పాత బాలకృష్ణగుప్తా, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్‌నాయక్ తదితరులు ఉన్నారు.