గజ్వేల్/బాన్సువాడ, ఏప్రిల్ 29: నీళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన నిజమైన నాయకుడు మన సీఎం కేసీఆర్ అని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం కుకునూర్‌పల్లి మండలం మంగోల్ వద్ద కామారెడ్డికి వెళ్లే 17వ ప్యాకెజీ కాలువ పనులను జుక్కల్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు హన్మంత్‌షిండే, మదన్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్ శాఖ అధికారుల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు.మల్లన్నసాగర్ నుంచి కామారెడ్డి జిల్లాలోకి ప్రవేశించే కాలువ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. మల్లన్నసాగర్ కట్టపై విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాకముందు గోదావరి నీళ్లు ఎన్ని ఉన్నాయో తెలియదు. ప్రాజెక్టులు ఎక్కడ కట్టాలో తెలియని పరిస్థితి ఉండేది. కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపుకోవడానికే భూంపల్లి కాల్వ తవ్వితే చుక్కనీరు తెచ్చింది లేదన్నారు.’ కేవలం కమిషన్ల కోసమే కాంట్రాక్టర్లకు అప్పట్లో పనులు అప్పగించారన్నారు.
ఇబ్బందులను అధిగమించి ప్రాజెక్టులు పూర్తి
కాళేశ్వరం ప్రాజెక్టుల వద్ద మెడిగడ్డ, సుందిళ్ల, అన్నారం పూర్తి చేసుకొని వరుస క్రమంలో అనంతసాగర్, రంగనాయక్‌సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ పూర్తి చేశారన్నారు. వీటన్నింటి ద్వారా 18లక్షల 75వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వడమే కాకుండా మరో 40లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రాజెక్టుతో లబ్ధి జరుగుతున్నదన్నారు. మల్లన్నసాగర్ నుంచి నిజాంసాగర్ వరకు కాలువ ద్వారా 6వేల క్యూసెక్కుల నీళ్లు హల్దీవాగు ద్వారా సింగూర్, నిజాంసాగర్‌కు చేరుతాయని, దీంతో రెండు పంటలకు సాగుకు అనుకులంగా ఉంటుందన్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి 2021లో నిజాంసాగర్‌లోకి నీళ్లు వదలడంతో రెండు పంటలను తమ జిల్లా రైతులు పండించుకున్నారని గుర్తుచేశారు. మల్లన్నసాగర్‌తో అనుసంధానంగా నిర్మించిన ప్రాజెక్టులతో తెలంగాణ సస్యశ్యామలవుతున్నదన్నారు. నిజాంసాగర్ కంటే మూడింతలు పెద్దదైన మల్లన్నసాగర్‌ను చూస్తే బాగుందని కితాబిచ్చారు. వర్షాలు పడకున్నా ఏడాది పాటు నిజాంసాగర్, శ్రీరాంసాగర్, మల్లన్నసాగర్, అనంతసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మసాగర్‌తో రైతులకు సాగునీరు అందించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. రిజర్వాయర్లకు శంకుస్థాపన చేసే సమయంలో మూడేండ్లలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్ చేప్పితే అందరం ఆశ్చర్యపోయమని, ఆయన చేసిన పనులను చూస్తే తామే నమ్మలేదన్నారు.
ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా..
తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలబడిందని, ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. మల్లన్నసాగర్ నుంచి హల్దీవాగులోకి వెళ్లే కాల్వ పనులు త్వరగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. ఇంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేసిన సీఎం కేసీఆర్ నిండునూరేండ్లు జీవించాలన్నారు.
భూములు త్యాగం చేసిన ప్రజలకు ధన్యవాదాలు
ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన ప్రజలకు స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు. అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని, సాగు,తాగునీరు అందించి ఇబ్బందులు తొలిగించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. ప్రాజెక్టులు చూస్తుంటే కడుపు నిండుతున్నదన్నారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిపోయి రాష్ట్రంలో ప్రతిపక్షాల నాయకులు గుండాలుగా వ్యవహరించడం విడ్డూరంగా ఉందన్నారు. మహారాష్ట్ర రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలేక తెలంగాణకు వచ్చి విక్రయించినట్లు గుర్తుచేశారు. మల్లన్నసాగర్‌తో బీడు భూములు సస్యశ్యామలమవుతాయన్నారు. మల్లన్నసాగర్ ద్వారా 12 నియోజక వర్గాల్లో పది లక్షల ఎకరాలకు ప్రత్యేకంగా, పరోక్షంగా సాగునీరు అందుతున్నదన్నారు.