ఈ-కేవైసీ ముసుగులో కొన్ని గ్యాస్ ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. అవసరం లేకపోయినా సిలిండర్ పైపులను అంటగడుతున్నాయి. అది కూడా నిర్ణీత ధరకన్నా రెట్టింపు డబ్బులు వసూలు చేస్తూ వినియోగదారులను దోచుకుంటున్నాయి. వాస్తవానికి ఈ-కేవైసీ చేయడానికి నిర్దేశిత గడువేమీ లేదు. అయితే, ఈ నెలాఖరులోపు పూర్తి చేసుకుంటేనే రూ.500కు వంట గ్యాస్ పథకం వర్తిస్తుందన్న పుకార్లు షికార్లు చేశాయి. దీంతో వినియోగదారులు ఏజెన్సీల ఎదుట బారులు తీరుతున్నారు. ఇదే అదనుగా కొందరు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు దోపిడీకి తెరలేపారు. ఏజెన్సీల్లోనే ఉచితంగా చేయాల్సిన ఈ-కేవైసీ ప్రక్రియను మీసేవ నిర్వాహకులకు అప్పగించి డబ్బులు వసూలు చేయిస్తున్నారు. మరికొందరేమో నిర్బంధంగా గ్యాస్ పైపులను అంటగడుతూ విచ్చలవిడిగా దోచుకుంటున్నారు.
ఐదు వందలకు సిలిండర్ ఇస్తారంటే కిసాన్‌నగర్ నుంచి బాల్కొండకు అచ్చిన. ఇక్కడ ఉన్న గ్యాస్ ఏజెన్సీ కాడ పొద్దుగాళ్ల నుంచి లైన్ల నిలవడ్డా. ఆధార్ కార్డు అడిగితే ఇచ్చిన. పని అయిపోయిందని 190 రూపాలు అడిగిండ్రు. ఎందుకని వాళ్లను అడిగితే సిలిండర్ పైపు ఇస్తున్నామన్నారు. నాకు అద్దని చెప్పిన. అయినా ఆళ్లు ఇనలే. 190 రూపాలు తీసుకుని పైపు చేతుల పెట్టిండ్రు.
బాల్కొండ, డిసెంబర్ 15: ఈ-కేవైసీ పేరుతో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీలకు వచ్చే వారి నుంచి దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ నెలాఖరులోపే ఈ-కేవైసీ చేయించుకోవాలని ప్రచారం జరగడంతో జనం గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు. దీంతో ఉదయం నుంచే ఏజెన్సీల వద్ద విపరీతమైన రద్దీ నెలకొంటున్నది. రాత్రి దాకా ఇదే ‘వరుస’ కనిపిస్తున్నది. గ్యాస్ వినియోగదారులు ఈ-కేవైసీ చేయించుకుంటేనే రూ.500కు వంటగ్యాస్ పథకం అమలవుతుందని ప్రచారం జరగడమే ఇందుకు కారణం. వాస్తవానికి ఈ-కేవైసీ చేయించుకోవడానికి నిర్దేశిత సమయం లేదని వంటగ్యాస్ డీలర్లు స్పష్టం చేస్తున్నారు. వీలైనంత త్వరగా కస్టమర్ల ఈ-కేవైసీ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందని చెబుతున్నారు. ప్రస్తుత ఈ-కేవైసీ ప్రక్రియకి, రూ.500కు సిలిండర్ పథకానికి సంబంధించి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెబుతున్నారు. ఇదేమి తెలియని జనం మాత్రం ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్నారు.
ఎన్నికల ముందర కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం హస్తం పార్టీ అధికారంలోకి రావడంతో వంటగ్యాస్ పథకం ఎప్పుడు ప్రారంభమవుతుందని వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, సబ్సిడీ వంటగ్యాస్ పొందాలంటే ఈ నెలాఖరులోపే ఈ-కేవైసీ చేయించుకోవాలని పుకార్లు చెలరేగాయి. దీంతో జనం ఏజెన్సీలకు పరుగులు పెడుతున్నారు. ఉదయం నుంచి రాత్రిదాకా క్యూలో నిల్చుని మరీ ఈ-కేవైసీ చేయించుకుంటున్నారు.
వినియోగదారుల ఆత్రుతను ఏజెన్సీల నిర్వాహకులు కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. ఏజెన్సీలే ఉచితంగా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే, కొందరు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు ఈ ప్రక్రియ చేపట్టకుండా మీసేవ నిర్వాహకులకు అప్పగించారు. తమ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ వివరాలు వారికి ఇచ్చి వినియోగదారులను అక్కడికి పంపిస్తున్నారు. మీసేవకు వెళ్లిన కస్టమర్ల నుంచి మీసేవ నిర్వాహకులు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇక మరికొన్ని ఏజెన్సీలేమో తమ వద్దకు వచ్చిన వినియోగదారులకు ఉచితంగానే ఈ-కేవైసీ చేస్తున్నా, నిర్బంధంగా గ్యాస్ పైపును అంటగడుతున్నారు. కస్టమర్లు వద్దంటున్నా తీసుకోవాల్సిందేనని బలవంతం చేసి మరీ కొనిపిస్తున్నారు. మార్కెట్లో రూ.100లకు లభించే గ్యాస్పైప్ను రూ.200లకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బాల్కొండ సహా పలుచోట్ల ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు స్పందించడం లేదని వినియోగదారులు వాపోతున్నారు.
ఈ-కేవైసీ పూర్తి చేయడానికి నిర్దేశిత సమయం లేదని గ్యాస్ డీలర్లు స్పష్టం చేస్తున్నారు. అయితే, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఉన్న వారు మాత్రం ఈ నెలాఖరు లోపు ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ వినియోగదారులు నిర్దేశిత సమయంలోపు చేయించుకుంటే సరిపోతుందన్నారు. ఈ నెలాఖరులోగా ఈ-కేవైసీ చేసుకుంటేనే రూ.500లకు వంటగ్యాస్ ఇస్తారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రూ.500కు వంటగ్యాస్ పథకానికి సంబంధించి ఎలాంటి విధివిధానాలు తమకు అందలేదని స్పష్టం చేశారు. మరోవైపు, ఈ-కేవైసీ కోసం వినియోగదారులు ఏజెన్సీల వద్దకు వచ్చి ఇబ్బందులు పడాల్సిన అసవరం లేదని ఎల్పీజీ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. తమ డెలివరీ బాయ్‌లు ఇంటికి వచ్చినప్పుడు ఈ ప్రక్రియను పూర్తి చేయించుకోవచ్చన్నారు. తప్పుడు ప్రచారాలు నమ్మి ఏజెన్సీల వద్ద బారులు తీరి ఇబ్బందులు పడవద్దని సూచించారు.
ఉజ్వల కనెక్షన్ ఉన్న వారు మాత్రమే ఈ నెల 31 లోపు ఈ-కేవైసీ చేయించుకోవాలి. కానీ అందరూ ఈ-కేవైసీ చేయాలని వస్తున్నారు. ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. మేము ఎవరి వద్ద డబ్బులు వసూలు చేయలేదు. బలవంతంగా గ్యాస్ పైపు అంటగట్టడం లేదు. కనెక్షన్ తీసుకుని ఐదేండ్లు దాటిన వారు మాత్రం పైపు మార్చుకోవాలని చెబుతున్నాం. వారు అడిగితే మార్కెట్ ధర ప్రకారమే డబ్బులు తీసుకుని పైప్ ఇస్తున్నాం. ఒక్క రూపాయి కూడా ఎక్కువగా తీసుకోవడం లేదు.