సుభాష్‌నగర్, అక్టోబర్ 23: జాన్కంపేట లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో సౌర వెలుగులు విరజిమ్మనున్నాయి. ఈ మేరకు ఆలయానికి చెందిన తొమ్మిది ఎకరాల స్థలంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా బహుళ ప్రయోజనాలు కలుగుతాయని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు దేవాదాయ శాఖకు విద్యుత్ బిల్లుల భారం తప్పుతుందని, అదే సమయంలో ఆలయ భూములకు రక్షణ లభిస్తుందని పేర్కొంటున్నారు.
నిత్య పూజలతో పాటు ప్రత్యేక పండుగలు, కల్యాణోత్సవాల సందర్భంగా కరెంట్ పోయి తీవ్ర ఇక్కట్లు ఏర్పడుతున్నాయి. అదే సమయంలో కరెంట్ బిల్లులు దేవాదాయ శాఖకు భారంగా మారాయి. మరోవైపు, ఆలయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ఇక నుంచి ఇలాంటి వాటికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాలో తొలి ఆలయంగా జాన్కంపేట లక్ష్మీనర్సింహ స్వామి ఆలయాన్ని ఎంపిక చేశారు. ఈ ఆలయానికి చెందిన తొమ్మిది ఎకరాల భూమిలో ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు.
ఉమ్మడి జిల్లాలో దేవాదాయశాఖ పరిధిలో మొత్తం 1,357 ఆలయాలు ఉన్నాయి. వీటిలో రూ. కోటి వరకు ఆదాయం ఉన్న ఆలయాలు 6(ఎ) కింద 6 ఉండగా, రూ. 25 లక్షల లోపు ఉన్నవి 6(బి) కింద 11 ఉన్నాయి. ఇక, 6(సీ) కింద 1340, 6(డీ) కింద రెండు మఠాలు ఉన్నాయి. అన్ని ఆలయాల్లో రోజూ విద్యుత్తు దీపాలు, ప్యాన్లు, ఏసీలు పనిచేస్తూనే ఉంటాయి. ఆయా దేవాలయాలకు ప్రతి నెల సుమారు రూ. 5 వేల నుంచి రూ.12 వేల వరకు విద్యుత్తు బిల్లులు వస్తున్నాయి. ఇక, ప్రత్యేక పూజలు, ఉత్సవాల్లో అలంకరించే రంగురంగుల దీపాలు, ఇతరత్రా వాటితో వినియోగం పెరిగి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు విద్యుత్ చార్జీలు చెల్లించాల్సి వస్తున్నది. ఈ క్రమంలో ఒక్కో దేవాలయానికి ఏడాదికి సగటున రూ. లక్షకు పైగా బిల్లులు చెల్లిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఎడపల్లి మండలం జాన్కంపేటలోని శ్రీలక్ష్మీ నర్సింహస్వామి దేవాలయానికి చెందిన 9 ఎకరాల్లో త్వరలో సోలార్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేయనున్నారు. రానున్న సంక్రాంతి లోపు పనులు సైతం పూర్తవుతాయని దేవాదాయశాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశలో 5 దేవాలయాలకు చెందిన 230 ఎకరాలను గుర్తించారు. అందులో జాన్కంపేట లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయం ఎంపిక కావటం విశేషం.
ఆలయాలకు వచ్చే ఆదాయంలో 20 నుంచి 40 శాతం విద్యుత్ బిల్లులకే చెల్లించాల్సి వస్తున్నది. దీన్ని అధిగమించేందుకు ఇంధన వనరుల పొదుపు సంస్థ, రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ ఆదేశాలతో గత మే నెలలో 11 ప్రధాన దేవాలయాల్లో సౌర విద్యుత్ ఏర్పాటు చేయడానికి ప్రతి పాదనలు పంపించాం. తొలిదశలో జాన్కంపేట ఆలయ భూముల్లో ప్లాంటు ఏర్పాటుకు ఎంపికైనట్లు తెలిసింది. అధికారికంగా ఆదేశాలు రావల్సి ఉంది.
– విజయరామారావు, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్