సారంగాపూర్, ఏప్రిల్ 3: జిల్లాలో ఇసుకతోపాటు మొరం అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికార యంత్రాంగం ఎన్నిచర్యలు తీసుకున్నా ఫలితం లేకుండా పోతున్నది. మండలంలోని గుండారంలో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) సమక్షంలో మొరం అక్రమ తవ్వకాలకు గురువారం వేలం నిర్వహించారు. వేలంలో ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలంటూ మైక్ ద్వారా గ్రామంలో చాటింపు వేయడం గమనార్హం. పంచాయతీ కార్యాలయంలో వీడీసీ సమక్షంలో వేలం ప్రక్రియ నిర్వహించగా, గ్రామానికి చెందిన కొంతమంది పోటీ పడినట్లు తెలిసింది.
రూ.లక్షల నుంచి వేలం ప్రారంభించగా.. చివరికి గ్రామానికి చెందిన ఒకరు రూ.2.50 లక్షలకు దక్కించుకున్నట్లు తెలిసింది. మొరం అక్రమ తవ్వకాల కోసం నిర్వహించిన వేలం విషయాన్ని రూరల్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి అక్రమ మొరం రవాణాకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకుంటామని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడొకరు స్పష్టం చేసినట్లు సమాచారం. స్థానిక బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కూడా వేలాన్ని వ్యతిరేకిస్తున్నారు.
గుండారం గ్రామ గుట్ట శివారు నుంచి రెండురోజుల క్రితం రాత్రివేళల్లో మొరాన్ని అక్రమ తరలిస్తున్నారనే సమాచారం తెలుసుకున్న కొందరు గ్రామస్తులు మొరం టిప్పర్లను అడ్డుకొని వీడీసీ సభ్యులకు అప్పగించారు. మొరం అక్రమ రవాణాను అరికట్టాలని వీడీసీ సభ్యులకు విన్నవించగా.. గురువారం మొరం అక్రమ తవ్వకాలకు వీడీసీ సమక్షంలోనే వేలం నిర్వహించడం గమనార్హం. మొరం తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లోనైనా అడ్డుకుంటామని గ్రామస్తులు స్పష్టం చేయగా.. మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు ఎలా స్పందిస్తారనే విషయంపై ఆసక్తి నెలకొన్నది.