నవీపేట, నవంబర్ 7 : రైల్వే గేట్ వేయడం ద్వారా ప్రయాణికుల ఇబ్బందులను దూరం చేసేందుకు చేపట్టిన దర్యాపూర్, మహంతం ఆర్యూబీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ప్రయాణికులు, ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దర్యాపూర్, మహంతం ఆర్యూబీ నిర్మాణ పనులకు అధికారులు 8 నెలల గడువు నిర్దేశించగా.. కాంట్రాక్టర్లు ఈ ఏడాది మార్చి నెలలో ప్రారంభించారు. నిర్మాణ పనుల నిర్ణీత గడువు ముగుస్తున్నా పనుల్లో వేగం పుంజుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ మార్గాల ద్వారా వెళ్లే రాంపూర్, ఫత్తేనగర్, ఎల్కే ఫారం గ్రామాల ప్రజలతో పాటు మహంతం, మోకన్‌పల్లి, ఆభంగపట్నం గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పనుల ప్రారంభం కన్నా ముందు ఆయా గ్రామాల ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తామనే హామీలు ఇచ్చిన కాంట్రాక్టర్లు ప్రస్తుతం ఏమీ పట్టనట్లు వ్యవహరించడంతో ఆయా గ్రామాల ప్రజలు, విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారుల ఆదేశాలు జారీ చేసినా కాంట్రాక్టర్లు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎనిమిది నెలల క్రితం ప్రారంభించిన దర్యాపూర్, మహంతం ఆర్యూబీ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా పనులు మందకొడిగా సాగుతున్నాయి. మరో ఆరు నెలల వరకు కూడా పనులు పూర్తయ్యే అవకాశాలు దరిదాపులో కనిపించడం లేదు. ఆయా గ్రామాల ప్రజలకు మరో కొన్ని నెలల పాటు తిప్పలు తప్పపోవచ్చు. మహంతం బ్రిడ్జి పనులు ఇప్పటివరకు కేవలం 25 శాతం పూర్తి కాగా.. దర్యాపూర్ పనులు 40 శాతం పూర్తయినట్లు పనులను బట్టి తెలుస్తున్నది. సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పనులను వేగవంతం చేసి, రాకపోకలు సాగే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారి రవిప్రకాశ్‌ను వివరణ కోరే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులో లేరు.