మోర్తాడ్, ఫిబ్రవరి 22: ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామంలోని పెద్దవాగు నుంచి అధికార పార్టీకి చెందిన కొందరు ఇసుక అక్రమ తవ్వకాలను యథేచ్ఛగా చేపడుతున్నారు. కొంతకాలంగా కొనసాగుతున్న ఇసుక దందాపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమవుతున్న వరుస కథనాలకు అధికార యం త్రాంగం కదిలింది. అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్నది అధికారుల దాడులతో బట్టబయలైంది.
గత సోమవారం నుంచి అధికారపార్టీ నాయకు ల ఆధ్వర్యంలో అక్రమ ఇసుక తవ్వకాలు చేపట్టా రు. దీనిపై ‘నమస్తే తెలంగాణ’లో వరుస కథనాలు రావడంతో శనివారం మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు దాడులు చేశారు. ఇసుకను అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఆరు ట్రాక్టర్లు, ఒక జేసీబీని పట్టుకున్నారు. అధికారులు ఎన్ని వే బిల్లులు ఇచ్చారు.. ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుకను తవ్వారు తదితర అంశాలను మైనింగ్ అధికారులు పరిశీలించినట్లు సమాచారం. అధికార యంత్రాంగం కదలడంతో ఎట్టకేలకు బట్టాపూర్ పెద్దవాగులో అక్రమ ఇసుక తవ్వకాలకు బ్రేక్పడినట్లయ్యింది.
బాల్కొండ సెగ్మెంట్లో పెద్ద ఎత్తున జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వాకలపై ‘నమస్తే తెలంగాణ’ వరు కథనాలతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ఇందులో భాగంగా ఉన్నతాధికారి నుంచి వచ్చిన ఆదేశాలతో విజిలెన్స్ అధికారులు శనివారం దాడులు చేసి వాహనాలు సీజ్ చేశారు. అయితే, స్థానిక కాంగ్రెస్ నేతలు మరికొన్ని గ్రామాల్లో ఇసుక వేట కోసం ప్రయత్నాలు చేస్తుండడం, ఇప్పటికే ఆయా మండలాల్లో పోలీసులు, తహసీల్ కార్యాలయ సిబ్బందితో ఒప్పందాలు కూడా చేసుకున్నట్లు సమాచారం.
మెండోరా మండలం వెల్కటూరు, ఏర్గట్ల మండలం తొర్తి, మోర్తాడ్ మండలం సుంకెట్, పాలెం, భీమ్గల్ మండలంలో బడాభీమ్గల్, భీమ్గల్, బెజ్జోరా, గోన్గొప్పుల తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఓవైపు ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని చెబుతుంటే, మరోవైపు అధికార పార్టీకి చెందిన వారే దొడ్డిదారిలో ఇసుక తోడేందుకు ఏర్పాట్లు చేస్తుండడం చర్చనీయాంశమైంది.