వినాయక్‌నగర్, జనవరి 27: నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల్ల్లో వరసగా చోరీలకు పాల్పడిన షట్టర్ లిఫ్టింగ్ దొంగల ముఠా నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ ఏసీపీ ఎల్.రాజా వెంకట్‌రెడ్డి సోమవారం తన కార్యాలంలో వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఠాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రలోని పర్బని జిల్లా కోత్వాల్ పోలీస్ ఠాణా పరిధిలో నివాసం ఉండే కరణ్ సింగ్ వృత్తిరీత్యా లారీ డ్రైవర్. కరణ్‌సింగ్ కొంత కాలంగా లాథూర్‌కు చెందిన కరణ్ సింగ్ బాపూరీ, అజయ్ సింగ్, జాల్నా కు చెందిన మనోహర్ సింగ్‌తో కలిసి ముఠాగా ఏర్పాడ్డారు.
వీరు గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు కేవలం నిజామాబాద్ నగరంలోని 11 చోట్ల షట్టర్ లిఫ్టింగ్ దొంగతనాలకు పాల్పడ్డారు. పదిరోజుల క్రితం నగరంలోని జవహార్ రోడ్డు, పూసలగల్లీలో వరుస చోరీలు జరగడంతో బాధితుల ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దర్యాప్తులో షట్టర్ లిఫ్టింగ్ దొంగల నాయకుడైన కరణ్ సింగ్‌ను అరెస్టు చేసి, అతడి నుంచి కట్టర్‌తోపాటు ఒక రాడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో ఉన్న మరో ముగ్గురు పరారీలో ఉన్నారని,వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో ఏసీపీ, ఎస్‌హెచ్‌వోతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.