వేల్పూర్, మే 9: ఏర్గట్ల మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో శనివారం బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ నేతలు సున్నపు అంజయ్య, జిట్టవోయినా రాజు, నాయు డు పోశెట్టి తదితరులు శనివారం వేల్పూర్‌లోని ప్రశాంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని, అయితే అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సాలు కావొస్తున్నా వాటిని సక్రమంగా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవడం, రైతుబంధు, బోనస్ వంటి హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించటం, పంట కొనుగోళ్లలో జాప్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదని, తెలంగాణకు కేసీఆర్ పరిపాలనే శ్రీరామరక్ష అని అన్నారు.
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజాపూర్ణనందం, ఏర్గట్ల సర్పంచ్ ఉపేందర్, మాజీ జడ్పీటీసీ గుళ్లే రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ మధు, పార్టీ అధ్యక్షుడు దేవుని నర్సయ్య, సొసైటీ చైర్మన్ బర్మా నర్సయ్య, ప్రభాకర్, కుశ లింబాద్రి పాల్గొన్నారు.