భిక్కనూరు, జనవరి18 : మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై ఏర్పాటుచేసిన స్పీడ్ బ్యాక్ బోర్డును కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైవేపై ప్రయాణిస్తున్నప్పుడు మన వాహన వేగం స్పీడ్ బ్యాక్ బోర్డులో కనిపిస్తుందని తెలిపారు. 80 స్పీడ్ లిమిట్‌ను మించి వెళ్తే బోర్డుపై రెడ్ లైట్ వెలుగుతుందని, ఆ వాహనం వివరాలు సైతం బోర్డులో నిక్షిప్తమవుతాయని వెల్లడించారు. వాటిని పరిశీలించి స్పీడ్ లిమిట్ దాటినవారికి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాలోనే స్పీడ్బ్యాక్ బోర్డును తొలిసారిగా ఏర్పాటు చేశామని, త్వరలోనే అవసరమైన ప్రాంతాల్లో మరిన్ని పెడతామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ అన్యోన్య, డీఎస్సీ సోమనాథం, సీఐ తిరుపయ్య, ఎస్బీఐ వీరయ్య, ఎస్సై ఆనంద్ గౌడ్, సిబ్బంది ఉన్నారు.