Nizamabad | వినాయక్ నగర్, సెప్టెంబర్ 5 : నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రెండున్నర సంవత్సరాల బాలుని కిడ్నాప్ కలకలం సృష్టించింది. తన తల్లిదండ్రులతో కలిసి వచ్చిన బాలుడు ఆస్పత్రి ఆవరణలో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన గుర్తు తెలియని మహిళ బాలుని అక్కడి నుండి ఎత్తుకు వెళ్లింది. బాలుడిని కిడ్నాప్ చేసుకొని తీసుకువెళ్లిన దృశ్యాలు ఆసుపత్రి ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలు రికార్డయ్యాయి. నిజామాబాద్-1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో రఘుపతి కథనం ప్రకారం.. బాల్కొండ మండలానికి చెందిన నవీన్ దంపతులు తమ ఇద్దరు కుమారులను పెద్ద కుమారుడు (4), చిన్న కుమారుడు (2) సంవత్సరాలు తీసుకొని శనివారం ఉదయం నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చారు. తల్లిదండ్రులు ఆస్పత్రిలో ఉండగా వారి ఇద్దరు కుమారులు ఆస్పత్రి ఆవరణలో ఓ పక్కన ఆడుకుంటూ ఉన్నారు. ఇద్దరు బాబులను గమనించిన ఓ గుర్తుతెలియని మహిళ వారిద్దరిని చెయ్యి పట్టుకొని తన వెంట తీసుకువెళ్లసాగింది.
ఈ క్రమంలో పెద్దబాబు ఆమెనుండి చేయి వదిలించుకొని తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేశాడు. చిన్న బాబు వేదాంషును మాత్రం ఆ గుర్తు తెలియని మహిళ కిడ్నాప్ చేసుకొని తీసుకువెళ్లింది. తమ్ముడిని ఎవరో తీసుకువెళ్లాడని పెద్ద కుమారుడు వచ్చి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి, వారి చిన్న కుమారుడు అక్కడ అగుపించకపోవడంతో కన్నీరు మున్నీరుగా రోదిస్తూ వారు ఆస్పత్రి ఆవరణలో వెతికారు. అయినప్పటికీ కుమారుడి ఆచూకీ తెలియలేదు. దీంతో బాధితులు వెంటనే డయల్ 100 కు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో విషయం తెలుసుకున్న వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి తన సిబ్బందితోపాటు హుటాహుటిన జిల్లా ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. బాలుడి కిడ్నాప్ ఉదాంతాన్ని తెలుసుకొని వారు ఆసుపత్రిలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలించగా ఓ మహిళ వేదాన్షును తన వెంట తీసుకు వెళుతూ ఉన్న దృశ్యం అక్కడ ఉన్న కెమెరాలు రికార్డైంది. దీంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాలుడిని కిడ్నాప్ చేసుకొని తీసుకువెళ్లిన మహిళ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ హెచ్ ఓ వెల్లడించారు.