నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 12 : జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లోని పాఠశాలల్లో సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల వేషధారణలు, భోగి మంటలు, రంగు రంగుల ముగ్గులు, బొమ్మల కొలువులు ఆకట్టుకున్నాయి. సిరికొండ మండల కేంద్రంలోని కిడ్స్‌పార్క్ స్కూల్లో, పొతంగల్ మండలం తిర్మలాపూర్ క్యాంప్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రత్యేకంగా రంగు రంగుల ముగ్గులు వేశారు. ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు.
బోధన్ పట్టణంలోని బోధన్ శ్రీ విజయసాయి ఉన్నత పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా హాజరయ్యారు. బోధన్ ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వర్ రావు దేశాయ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సునీత దేశాయ్, 26వ వార్డు కౌన్సిలర్ అంకు సంధ్య దామోదర్ పాల్గొని విద్యార్థినులు వేస్తున్న ముగ్గులను పరిశీలించారు. బాల్కొండ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో బోగి మంటలు వేశారు. కృష్ణవేణి హైస్కూల్లో పతంగులను ఎగురవేశారు. డొంకేశ్వర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలను అలంకరించారు.
భీమ్‌గల్ పట్టణంలోని సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. భీమ్‌గల్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు బసంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గెలుపొందిన వారిరి బహుమతులను అందజేశారు. మాక్లూర్ మండలంలోని దాస్‌నగర్ శివారులోని విజయ్రూరల్ ఇంజినీరింగ్ కళాశాలలో ముగ్గుల పోటీ, మెహందీ పోటీలు నిర్వహించారు. రెంజల్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, కళశాలలో ముగ్గుల పోటీలను నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ బలరాం తెలిపారు. ఎంపికైన విద్యార్థినులకు బహమతులను అందజేసినట్లు పేర్కొన్నారు.
రెంజల్ మండలం బాగేపల్లిలో సర్పంచ్ పాముల సొంత ఖర్చుతో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఎంపీటీసీ గంగాలత భూమేశ్, ఉప సర్పంచ్ సుదర్శన్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లోటస్ పాఠశాలలో, జెండాగల్లిలోని జెంటిల్కిడ్స్ పాఠశాలలో, మామిడిపల్లిలోని తపస్వీ స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో బాలికలకు ముగ్గులు, బాలురకు పతాంగుల పోటీలను నిర్వహించి ఉత్తమ ముగ్గులు వేసిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. విద్యార్థులకు బోగి పండ్లు పోశారు. ఏర్గట్లలోని నలంద ప్రైవేటు పాఠశాలలో విద్యార్థినులు ముగ్గులు వేశారు.