లింగంపేట/ నిజాంసాగర్/ ఎల్లారెడ్డి రూరల్/ పిట్లం/ నాగిరెడ్డిపేట్, మే 20: జిల్లావ్యాప్తంగా పారిశుద్ధ్య వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గ్రామాల్లో మురికి కాలువలు శుభ్రం చేయడం, చెత్తను తొలగించడం, రహదారులపై గుంతలు పూడ్చడం తదితర పనులు చేపడుతున్నారు. ఆయా గ్రామాల్లో చేపడుతున్న పనులను అధికారులు, ప్రజా ప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
లింగంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో పనులు కొనసాగుతున్నాయి. రోడ్లు శుభ్రం చేయడంతో పాటు మురికి నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టారు.
నిజాంసాగర్ మండలంలోని బంజపల్లి, అచ్చంపేట గ్రామాల్లో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను మండల ప్రత్యేకాధికారి విజయభాస్కర్‌రెడ్డి పరిశీలించారు. ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన కార్యదర్శులకు సూచించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి గంగారాం, నాయకుడు లింగాగౌడ్, కారోబార్ సాయిలు తదితరులు ఉన్నారు.
ఎల్లారెడ్డి పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో పారిశుద్ధ్య పనులను చేపట్టినట్లు బల్దియా కమిషనర్ జగ్జీవన్ తెలిపారు. కాలనీలోని మురికి కాలువలను శుభ్రం చేయించడంతోపాటు పిచ్చి మొక్కలను తొలగించామన్నారు. దోమల నివారణకు మురికి కాలువల్లో ఆయిల్‌బాల్స్ వేయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆయనతోపాటు వార్డు కౌన్సిలర్ సంగని బాలమణి, నాయకుడు పోచయ్య తదితరులు ఉన్నారు.
పిట్లం పోలీస్‌స్టేషన్ క్వార్టర్స్ పరిసరాలు, బుడగజంగం, శాంతినగర్ కాలనీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పంచాయతీ కార్యదర్శి యాదగిరి సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది శ్రీనివాస్, బసంత్, అంకం శ్రీను తదితరులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట్తోపాటు ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను ఎంపీపీ రాజదాస్, అధికారులు పర్యవేక్షించారు. పోచారం గ్రామంలో కార్మికులు చేపడుతున్న పనులను ఎంపీపీ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పరిశుభ్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించాల న్నారు. ఆయన వెంట ఎంపీడీవో రఘు, ఎంపీవో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.