నిజామాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎట్టకేలకు నిజామాబాద్ జిల్లాకు పోలీసు బాస్ వచ్చారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు నూతన కమిషనర్ రానున్నారు. ఐదారు నెలలుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టుకు 2016 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి పోతరాజు సాయి చైతన్యను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఈయన హైదరాబాద్‌లో యాంటీ నార్కొటిక్స్ బ్యూరోకు ఎస్పీగా పని చేస్తున్నారు. కల్మేశ్వర్ బదిలీ అనంతరం నిజామాబాద్ సీపీగా పూర్తి స్థాయి బాధ్యతలను ఎవరికీ అప్పగించలేదు. దీంతో పోలీస్ కమిషనరేట్‌లో ఆడిందే ఆట పాడిం దే పాటగా మారింది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఠాణాల్లో దుస్థితి నెలకొన్నది. ఇన్చార్జి సీపీ ఉన్నప్పటికీ కామారెడ్డికే పరిమితం కావడంతో పర్యవేక్షణ కొరవడింది. సుదీర్ఘ కాలం ఇన్చార్జి సీపీగా కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మకు బాధ్యతలనుఅప్పగించగా, తాజా బదిలీల్లో ఆమెకు సైతం స్థానచలనం కల్పించింది. 2014 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సింధూ శర్మను ఇంటిలిజెన్స్ ఎస్పీగా విధులను కేటాయించింది. ఈమె స్థానంలో కామారెడ్డి ఎస్పీగా 2015 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఎం.రాజేశ్ చంద్రను నియమించారు. ఈయన ప్రస్తుతం యాదాద్రి భువనగిరి డీసీపీగా పని చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖలో గతంలో ఎన్న డూ లేని విధంగా ఐపీఎస్ అధికారుల మార్పులు, చేర్పులు జరిగాయి. కీలకమైన నిజామాబాద్‌కు గతంలో ఐదున్నరేండ్ల పాటుగా సీపీగా కార్తికేయ పని చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కార్తికేయ బదిలీ కాగా ఆయన స్థానంలో సెప్టెంబర్ 1, 2023న డీఐజీ ర్యాంక్ అధికారి వి.సత్యనారాయణ వచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో రాష్ట్రమంతటా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ సమయంలోనే పలు రాజకీయ పార్టీల ఫిర్యాదుతో సరిగ్గా 40 రోజుల వ్యవధిలోనే సీపీ సత్యనారాయణను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఈయన స్థానంలో కల్మేశ్వర్ సింగెనవార్ను అక్టోబర్ 11న ఈసీ నియమించింది. సరిగ్గా ఏడాది కాలం పని చేసిన కల్మేశ్వర్ సింగెనవార్ను కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఒత్తిడితో ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసింది. దీంతో ఆయన స్వచ్ఛందంగా సెంట్రల్ సర్వీసులకు వెళ్లడంతో అక్టోబర్ 17న తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవ్ అ య్యారు. నాటి నుంచి ఇన్చార్జీ సీపీగా సింధూ శర్మ పని చేస్తూ వచ్చారు. ఇప్పుడు తాజాగా పోతరాజు సాయి చైతన్యను సర్కారు నియమించడంతో ఏడాదిన్నర కాలంలో మొత్తంగా ఐదుగురు ఐపీఎస్ అధికారుల మార్పు జరిగినైట్లెంది.
కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ ఏడాదిన్నర కాలంలోనే బదిలీ అయ్యారు. 2023, సెప్టెంబర్ 1న ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఎస్పీ గా ఉన్న శ్రీనివాస్ రెడ్డి బదిలీ అయ్యారు. నెలన్నర రోజుల తర్వాత అక్టోబర్ 14న సింధూ శర్మను కామారెడ్డి ఎస్పీగా ఈసీ నియమించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది కాలంగా సింధూ శర్మ పని చేస్తున్నారు. తాజా బదిలీల్లో ఇంటెలిజెన్స్ ఎస్పీగా నియమితులయ్యారు. సింధూ శర్మ కాలంలోనే 2023, డిసెంబర్లో సదాశివనగర్ మండలంలో ఆరుగురి హత్యల కేసు వెలుగు చూడగా పురోగతి సాధించారు. 2024, డిసెంబర్లో ఇదే మండలంలో ఎస్సై, మహిళా కానిస్టేబుల్, ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడగా, ఈ కేసులో పురోగతి సాధించలేదు. ఇసుక, మొరం దందాలను పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోయారు. భారీ ప్రకటనలు జారీ చేసినప్పటికీ క్షేత్ర స్థాయిలో ఇసుకాసురులను నిలువరించలేక పోయారు. క్షేత్ర స్థాయిలో ఆమె ఆదేశాలను పో లీసులు పట్టించుకోలేదు. ఇసుక, మొరం అక్రమార్కులతో చేతులు కలిపి పొలిటికల్ అండతో ఖాకీలు చెలరేగి పోయారు. వారిపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోకపోవడంలో సింధూ శర్మ వెనుకబడ్డారని విమర్శలు వచ్చాయి. ఆమె ఉన్నప్పుడే రెంజల్ ఠాణాలో లాకప్ డెత్ తరహా ఘటన జరగడం గమనార్హం.