కామారెడ్డి, జూన్ 12 : పాఠశాల విద్యార్థుల ప్రయాణ భద్రతకు అత్యంత కీలకం బస్సుల ఫిట్నెస్. కానీ కొన్ని పాఠశాలలు బస్సులను ఫిట్నెస్గా ఉంచడంతో నిర్లక్ష్యం వహించడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల 15 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభకానున్నది. పాఠశాలలకు దూరంగా ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు చెందిన బస్సు, ఆటోల్లో పంపిస్తుంటారు. ఒక పాఠశాలలు విద్యార్థుల అడ్మిషన్లు, ఫీజులపై ఉన్న శ్రద్ధ వారు ప్రయాణించే బస్సులపై లేకపోవడం గమనార్హం. జిల్లాలో కొన్ని పాఠశాలల యాజమాన్యాలు తక్కువ ధరకు బస్సులను కొనుగోలు చేస్తున్నాయి. వాటికి కొత్తగా రంగులు వేయించి ఫిట్నెస్ లేకుండా, ఎలాంటి అనుభవం లేని డ్రైవర్లతో బస్సులను నడిపిస్తున్నారు. ఫిట్నెస్ రెన్యూవల్ చేయించుకోవడంలోనూ పాఠశాలల యాజమన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. విద్యా సంస్థల ప్రారంభానికి ముందే బస్సులను కండీషన్లో ఉంచుకోవాల్సిన యాజమాన్యాలు తనిఖీలు చేస్తే గానీ ఫిట్నెస్ చేయించడానికి ముందుకురావడంలేదు. జిల్లాలోని పలుచోట్ల అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో మొత్తం 277 స్కూల్ బస్సులు ఉన్నాయి.ఇందులో ఇప్పటి వరకు కేవలం 173 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించగా, ఇంకా 96 బస్సులకు ఆ పాఠశాలల యాజమాన్యాలు చేయించుకోలేదు. తమ పాఠశాలల్లో చేరాలని ప్రతి గ్రామంలో రూ. లక్షలు ఖర్చుచేస్తూ జోరుగా ప్రచారం నిర్వహించే పాఠశాలల యాజమాన్యాలు..విద్యార్థులను తరలించే బస్సుల ఫిట్‌నెస్‌పై మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీవో అధికారులు స్కూల్ బస్సు డ్రైవర్లకు బస్సుల ఫిట్నెస్, డ్రైవర్లు తీసుకోవాల్సి జాగ్రత్తలు, నిబంధనలపై అవగాహన కల్పించారు.
జిల్లాలో పలు పాఠశాలల బస్సులకు ఫిట్నెస్ లేకపోవడంతో పలు ప్రమాదాలు చోటుచేసకున్న ఘటనలూ ఉన్నాయి. పాత వాహనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి నడిపిస్తున్నారు. బస్సులను నడపడానికి అనుభవం లేని డ్రైవర్లను తక్కువ వేతనాలకు నియమించుకుంటున్నారు. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాల బస్సుల్లో పంపించాలంటేనే ఆందోళనకు గురవుతున్నారు.ఇప్పటికైనా ఫిటెనెస్‌తో ఉన్న బస్సులను నడపాలని, అనుభవం ఉన్న డ్రైవర్లను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
కామారెడ్డి జిల్లాలో 277 బస్సులకు ఇప్పటి వరకు 173 బస్సులకు ఫిటెనెస్ పరీక్ష చేయించుకున్నారు.మిగతా 96 బస్సులను పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా చేయించుకోవాలి. ఫిట్నెస్ లేని బస్సులను నడపడానికి వీలు లేదు. ఒక వేళ నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. అటువంటి వాహనాలను సీజ్ చేస్తాం.
– సంతోష్‌కుమార్, జిల్లా రవాణాశాఖాధికారి