గులాబీ బాస్ ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం కోసం నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 30న జుక్కల్, బాన్సువాడ బహిరంగ సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్.. నవంబర్ 2న బాల్కొండ, 3న ఆర్మూర్‌లో అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. 9వ తేదీన కామారెడ్డిలో నామినేషన్ వేయనున్న గులాబీ దళపతి.. అదేరోజు కామారెడ్డిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
– నిజామాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించడమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితి జోరు గా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు ఇప్పటికీ అభ్యర్థులను ప్రకటించుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. వారికి నియోజకవర్గాల్లో అభ్యర్థులే కరువవ్వగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎన్నికల ప్రచారంలో దూ సుకుపోతున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ల్లో అభ్యర్థులంతా జోరుగా ప్రచారంలో మునిగి తేలుతుండగా సీఎం కేసీఆర్ సైతం ఉమ్మడి జిల్లా లో నియోజకవర్గాల వారీగా ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు.
అక్టోబర్ 15న షురూ కానున్న సీఎం కేసీఆర్ టూర్ ఏకంగా నవంబర్ 9వ తేదీ వరకు కొనసాగబోతున్నది. ఇందులో నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, ఆర్మూర్, కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ, జుక్కల్, కామారెడ్డి నియోజకవర్గాలకు వస్తున్నారు. నవంబర్ 9వ తేదీనాడు కామారెడ్డిలో స్వయంగా సీఎం కేసీఆరే నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. కేసీఆర్ పర్యటనలు ఖరారు కావడంతో ఎమ్మెల్యే అభ్యర్థులంతా భారీగా ఎన్నికల సభలను తలపెట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రతిపక్షాలకు ఎన్నికల ప్రచార సభల ద్వారా గట్టి సమాధానాన్ని ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. రెండో విడుత సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్లో మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించిన టూర్ ఖరారు కానున్నట్లుగా తెలిసింది.
అక్టోబర్ 15న హుస్నాబాద్ పర్యటనతో ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శ్రీకారం చుట్టబోతున్నారు. వరుసగా ఆయా నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు సైతం గులాబీ అధినేత రాబోతున్నారు. ఉమ్మడి జిల్లాలో తొలి సభ కామారెడ్డి జిల్లా జుక్కల్, బాన్సువాడలో జరుగనున్నది. అక్టోబర్ 30న మధ్నాహ్నం ఒంటి గంటకు జుక్కల్ నియోజకవర్గంలో జరిగే సభలో కేసీఆర్ పాల్గొంటారు.
తదనంతరం బాన్సువాడ నియోజకవర్గ సభలో మధ్యాహ్నం 2గంటలకు హాజరవుతారు. నవంబర్ 2వ తారీఖు నాడు మధ్యాహ్నం 2గంటలకు బాల్కొండ నియోజకవర్గ సభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. నవంబర్ 3న ఆర్మూర్ సభకు గులాబీ బాస్ రానున్నారు. వివిధ జిల్లాల్లో పర్యటన అనంతరం నవంబర్ 9న కేసీఆర్ నామినేషన్ వేస్తారు. ఉదయం గజ్వేల్‌లో నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారికి సమర్పించిన తర్వాత అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ్నుంచి నేరుగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుని మధ్యాహ్నం 2గంటలకు నామినేషన్‌ను దాఖలు చేస్తా రు. సాయంత్రం 4గంటలకు బహిరం గ సభకు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Kcr
గత ఎన్నికల్లో అనుసరించినట్లే ఈసారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు అన్ని నియోజకవర్గాలకు రాబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పక్కాగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే షెడ్యూల్‌ను వెల్లడించింది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఐదు నియోజకవర్గాలకు ఇందులో చోటు దక్కింది. మిగిలిన నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన షెడ్యూల్ వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నట్లు తెలిసింది. నిజామాబాద్ అర్బ న్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సమయానుకూలంగా సభల ఏర్పాటుపై చర్చిస్తున్నట్లుగా సమాచారం.
ఒక రోజులో 2 లేదంటే 3 సభలకు హాజరయ్యేలా కేసీఆర్ ప్లాన్ చేశారు. తొలి సభ హుస్నాబాద్‌లో నిర్వహించిన తర్వాత జిల్లాల పర్యటనలో భాగంగా ఉమ్మడి జిల్లాకు సీఎం కేసీఆర్ నాలుగు సార్లు రాబోతున్నారు. ఇందులో వరుసగా నవంబర్ 2, 3 తేదీల్లో నిజామాబాద్ జిల్లాకు వస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ప్రతి నియోజకవర్గానికి బీఆర్ఎస్ అధినేత హాజరవుతున్నారన్న సమాచారంతో ఎమ్మెల్యే అభ్యర్థులంతా ఘనంగా ఏర్పాట్లు చేసుకునేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పకడ్బందీగా నియమ, నిబంధనలను అనుసరించేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నామినేషన్ దాఖలు కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నది. నవంబర్ 9న నామినేషన్ ఘట్టం ఉండడంతో భారీగా స్వాగత ఏర్పాట్లతో పాటుగా బహిరంగ సభతో సత్తా చాటేందుకు నియోజకవర్గంలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నేతృత్వంలో కీలక భేటీ సైతం ఈ మధ్యే జరిగింది. తన క్యాంపు కార్యాలయంలోనే నియోజకవర్గ స్థాయి నాయకులతో గంప గోవర్ధన్ ప్రత్యేకంగా సమావేశమై నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు చేశారు.
కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ పేరు ఖరారైన తర్వాత తొలిసారిగా బీఆర్ఎస్ అధినేత ఈ ప్రాంతానికి వస్తుండడంతో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సమన్వయంతో సభను కనీవిని ఎరుగని రీతిలో నియోజకవర్గ ప్రజలతో పెద్ద ఎత్తున నిర్వహించాలని యోచిస్తున్నారు. కామారెడ్డి అభ్యర్థిగా సీఎం కేసీఆర్ రానుండడంతో సభా వేదిక ద్వారా బీఆర్ఎస్ అధిపతి ఇవ్వబోయే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. మొత్తానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల సభల షెడ్యూల్ ఖరారు కావడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తున్నది.