నిజామాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత 2023, డిసెంబర్ 7న కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా నేటికి రెండేళ్లు పూర్తైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి నోటికొచ్చిన వాగ్ధానాలను ఇచ్చారు. అభయ హస్తం మేనిఫెస్టోలో 420 హామీలు, ప్రధానంగా ఆరు గ్యారంటీలు పేరుతో ప్రజల్లో ఆశలు పెంచారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ప్రకటించారు.
ఇందులో ప్రధానంగా మహిళలకు నెలకు రూ.2500, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులకు రూ.లక్ష సాయంతో పాటుగా తులం బంగారం, రైతులకు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 2లక్షల ఉద్యోగాలు వంటివి అనేకం ఉన్నాయి. ఈ హామీల అమలులో ఆది నుంచి అడుగడుగునా వైఫల్యాలు, ఆర్థిక సవాళ్లు, పరిపాలనలో లోపాల వల్ల ప్రజల్లో రేవంత్ రెడ్డి సర్కార్‌పై తీవ్ర అసంతృప్తి పెరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్ ఎన్నికల్లో రాజకీయంగా తీవ్ర పరిణామాలను తెచ్చి పెడుతోంది.
అడుగడుగునా నిలదీతలు, ఆగ్రహావేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుని ప్రచారం చేయాలంటేనే అభ్యర్థులు భయ పడుతున్నారు. అధికార పార్టీ మాత్రం విజయం సాధించే అభ్యర్థులంతా తమ వారిగా ప్రచారం చేసుకుంటోంది. పార్టీలకు అతీతంగా జరిగే సర్పంచ్ ఎన్నికల్లో ఎదురవుతోన్న అనుభవాలతో హస్తం పార్టీ తంటాలు పడుతోంది. జనాలంతా ఈ రెండేళ్ల పరిపాలనను అనుభవించిన తర్వాత ఇదేం ప్రజాపాలన అంటూ నిట్టూరుస్తున్నారు.
ఉచిత బస్సు.. తుస్సు..
ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ పథకం తీసుకు వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణమంటే నరకప్రాయం అన్నట్లుగా మారింది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనే ఈ పథకాన్ని పరిమితం చేశారు. డీలక్స్, సూపర్ డీలక్స్, ఇంద్ర, గరుడ వంటి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని నో ఎంట్రీ చేశారు. ఎన్నికల సమయంలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లోనే ఉచిత ప్రయాణమంటూ ఏనాడు కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు. అన్ని రకాల సర్వీసులో ఉచిత బస్సు అమలవుతుందని అంతా ఆశించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ మోసాన్ని మహిళా లోకం ఎదుర్కొంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా పెరిగినట్లుగా కనిపిస్తోంది. దీనికి జనాల రద్దీ పెరగడం కారణమా? ఆర్టీసీ సర్వీసులను తగ్గించడమా? అన్నది తేలడం లేదు.
ఉచిత బస్సు పథకం వచ్చిన నాటి నుంచి ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లుగా బస్సులు అందుబాటులో ఉండటం లేదు. ఇరుకు ప్రయాణం, నిలబడటం తప్పా ఉచిత ప్రయాణంతో మహిళలకు ఒరిగిన మేలు ఏమీ ఉండటం లేదు. గతంలో ఎక్కడ పడితే అక్కడ చేయి అడ్డం పెట్టగానే ఆర్టీసీ బస్సులు ఆపేది. కానిప్పుడు మహిళలు కనిపిస్తే ఆర్టీసీ బస్సులు ఆగడం లేదు. ఉచిత ప్రయాణం వల్ల మహిళల పట్ల వివక్షను చూపిస్తున్నారు. ఇందుకు సంబంధించి అనేక ఘటనలు నిజామాబాద్ రీజియన్‌లోనే చోటు చేసుకున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భవతులు, బాలింతలు ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలంటే సాహసం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. రద్దీ ప్రయాణంలో ఇబ్బందులను గ్రహించి ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
ప్రజల్లోకి బీఆర్ఎస్ బాకీ కార్డు…
కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలపై బీఆర్ఎస్ పార్టీ ఏకంగా బాకీ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించింది. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై వినూత్నంగా ప్రచారం చేస్తుండటంపై ప్రజల నుంచి అద్భుతంగా స్పందన వస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో బాకీ కార్డులను పెద్ద ఎత్తున అందివ్వడంతో పాటుగా వాట్సప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లలోనూ ప్రచారం చేస్తున్నారు. ఈ తరహా ప్రచారంతో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విషయం తెలుస్తుండటంతో అధికార పార్టీ నేతలంతా ఆగమాగం అవుతున్నారు.
రైతులకు దగా.. బీసీలకు మోసం..
రైతులను కాంగ్రెస్ పార్టీ నిలువునా ముంచేసింది. రూ.2లక్షలు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సుమారుగా 1.70లక్షల మంది రైతులకు రుణమాఫీ వర్తింపజేయలేదు. సకాలంలో రైతులకు సాగు నీళ్లు అందడం లేదు. ఎరువులు, విత్తనాల గోస చెప్పక్కర్లేకుండా తయారైంది. వానాకాలంలో యూరియా కష్టాలతో రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వచ్చిన వరదలతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది.
సీఎం స్వయంగా వచ్చి హామీ ఇచ్చినప్పటికీ సాయం అందలేదు. రైతుబంధు స్థానంలో ఎకరాకు రూ.15వేలు ఏటా అందిస్తామని చెప్పి పెట్టుబడి సాయాన్ని రూ.12వేలకు తగ్గించి అరకొరగా అందించారు. సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఎగ్గొడుతున్నారు. గత యాసంగిలో ఉమ్మడి జిల్లా రైతులకు రూ.449కోట్లు బోనస్ బకాయిలు పడ్డారు. ఇక కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లతో పాటుగా 18 రకాల హామీలను గుప్పించింది. ఇందులో ఒక్కటంటే ఒక్క హామీని పూర్తి స్తాయిలో అమలు చేయలేదు. బీసీ ప్రజలను, బీసీ సంఘాలను తమవైపు తిప్పుకునేందుకు పూటకో రీతిలో రేవంత్ సర్కారు కుయుక్తులకు పాల్పడుతూ కాలం గడుపుతోంది.
కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి
నవీపేట,డిసెంబర్ 6: సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను ఓడించాలి. పదేండ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేసింది. బీఆర్ఎస్ మద్దతు దారులను గెలిపించాలి.
-టేకు లింగం, బీఆర్ఎస్ మోకన్‌పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు, నవీపేట మండలం
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
నవీపేట,డిసెంబర్ 6: ఆరు గ్యారెంటీల హామీల పేరిట అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం, వాటిని అమలుచేయడంలో పూర్తిగా విఫలమైంది. రెండేండ్లు కావస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలేదు. రైతులకు రైతుభరోసాతో పాటు సన్నాలకు క్వింటలుకు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పి రెండేండ్ల వ్యవధిలో కేవలం వానకాలం సీజన్‌కు మాత్రమే సగం డబ్బులు జమ చేసి చేతులు దులుపుకున్నది. యాసంగిలో పండించిన ధాన్యానికి బోనస్ ఎగ్గొట్టింది. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఆగ్రహంతో ఉన్నారు.
-వి.నర్సింగ్‌రావు, బీఆర్ఎస్ పార్టీ నవీపేట మండల అధ్యక్షుడు
ఏ ఒక్క హామీ అమలుకు నోచుకోలేదు
నిజాంసాగర్, డిసెంబర్ 6: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇంతవరకూ అమలు కాలేదు. ఏ ఒక్క పథకాన్ని పూర్తిస్థాయిలో నెరవేర్చలేదు. రైతుల కోసం కూడా ఎన్నో హామీలు ఇచ్చారు. ఎరువులు, రుణమాఫీ వంటి అంశాల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి రెండేండ్లవుతున్నా ఇంతవరకూ దాని ఊసే లేదు.
-విజయ్దేశాయ్, కాటేపల్లి, పెద్దకొడప్గల్ మండల
పథకాల్లో కోత విధిస్తున్నారు..
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైం ది. పింఛన్లను రెట్టింపు చేస్తామని, విద్యార్థినులకు స్కూటీ లు అందజేస్తామని, రైతు బంధు ఎకరాకు ఏడాదికి రూ.15వేలు అందిస్తామని వీటితో పాటు మరెన్నో పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కొత్త పథకాలను పక్కనపెడితే ఉన్న వాటిలోనే కోత విధిస్తున్నారు.
-అనంత్రావ్దేశాయ్, కాప్లాబాద్, పెద్దకొడప్గల్