Power Cuts | కామారెడ్డి : పంటలు చేతికొచ్చే వేళ విద్యుత్ కోతలతో ఎండిపోతున్నాయని ఆగ్రహించిన కారేగావ్ శివారు రైతులు గురువారం రోడ్డెక్కారు. రోజుకు కేవలం రెండు, మూడు గంటలే విద్యుత్ ఇస్తున్నారని, వచ్చిన కరెంట్ కూడా లో-వోల్టేజ్‌తో మోటార్లు పనిచేయడం లేదని ఆరోపిస్తూ స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట, కారేగావ్-గోధుమగావ్ ప్రధాన రహదారిపై గంటల తరబడి బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ‘ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. సమయానికి నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.