నిజామాబాద్, ఆగస్టు 24, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి(జీజీహెచ్)లో ర్యాగింగ్ జడలు విప్పుకుంది. జూనియర్లపై సీనియర్ల వేధింపులు తగ్గుముఖం పట్టిందని భావిస్తోన్న సమయంలో ఆకతాయి చేష్టాలు మళ్లీ అగ్గి రాజేసింది. నాలుగేళ్లుగా సీనియర్ల వేధింపులను భరిస్తూ వచ్చిన రాహుల్ రెడ్డి అనే వైద్య విద్యార్థి చేసేది లేక సహనం నశించి పోలీసులను ఆశ్రయించడంతో ర్యాగింగ్ గుట్టు రట్టు అయ్యింది.
నిజామాబాద్ మెడికల్ కాలేజీలో కొన్ని రోజులుగా సాగుతోన్న ర్యాగింగ్ తంతు తేటతెల్లం అయ్యింది. వైద్య విద్యార్థి ఫిర్యాదుతో నిజామాబాద్ మెడికల్ కాలేజీ బాధ్యులు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యులు, పోలీసు శాఖ నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేసింది. ర్యాగింగ్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన మెడికల్ కాలేజీ బాధ్యులెవ్వరూ ఈ విషయంపై కనీసం పట్టించుకోలేదు. పోలీసులు సైతం నిరంతరం తనిఖీలు నిర్వహించలేదు. మమ్మల్ని ఎవరూ ఆపేది అనే స్థాయిలో వైద్య విద్యార్థులు రెచ్చిపోయి ప్రవర్తించడంతో జూనియర్ వైద్య విద్యార్థుల బాధలు వెలుగు చూస్తున్నాయి.
డే స్కాలర్స్ వర్సెస్ వసతి గృహ విద్యార్థులు అన్నట్లుగా సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య స్పష్టంగా విభజన రేఖ కనిపిస్తున్నప్పటికీ ఈ సమస్యను ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొపెస్టర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర వైద్య సిబ్బంది, హాస్టల్ వార్డెన్, నాన్ అకాడమిక్ సిబ్బంది ఎవ్వరూ గుర్తించకపోవడం విడ్డూరంగా మారింది. ఏడాదిన్నర క్రితం వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతానికే ఓ యువతి బలి అయినప్పటికీ గుణపాఠం రాకపోవడం విడ్డూరంగా మారింది.
నా పేరు రాహుల్ రెడ్డి. నేను డే స్కాలర్‌ను. హాస్టల్లో ఉండే కొంత మంది ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారు. డే స్కాలర్లను లొంగదీసుకోవడం కష్టంగా ఉండటంతో మమ్మల్ని చీటికి మాటికి సూటిపోటి మాటలతో చాలా రోజుల నుంచి వేధిస్తున్నారు. చదువు ముఖ్యమని భావించి వివాదాలకు దూరంగా ఉంటూ వచ్చాను. నాలుగేళ్లుగా ఏదో విధంగా వేధించాలని కొంత మంది సీనియర్లు ప్రయత్నాలు చేశారు.
చివరకు నేను ఇంటర్న్‌షిప్‌లో ఉండగా వరుసగా ఐదు రోజుల పాటు నా హాజరును గైర్హాజరుగా కొంత మంది సీనియర్లు కావాలని రిజిష్టర్‌లో నమోదు చేశారు. రికార్డులు పరిశీలిస్తే ఇదంతా తెలుస్తుంది. ఇదే విషయంపై అడిగేందుకు సీనియర్లను కలువగా 15 మంది ఇష్టమొచ్చినట్లుగా బూతులు తిడుతూ రభస చేసి దాడి చేశారు. బయోటేడా చెప్పాలని వేధించారు. 15 సార్లు చెప్పించారు. అనేక రకాలుగా వేధింపులకు గురి చేసినప్పటికీ భరించాను. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
– రాహుల్ రెడ్డి, బాధిత వైద్య విద్యార్థి
రాహుల్ రెడ్డి అనే వైద్య విద్యార్థిని వేధించిన కేసులో మెడికల్ కాలేజీ హాస్టల్ రూమ్ నెంబర్ 302 కీలకంగా మారింది. సీనియర్, జూనియర్ల మధ్య తలెత్తిన వివాదంలో సెటిల్మెంట్ చేసుకుందామని కొద్ది మంది హౌస్ సర్జన్లు నిర్ణయించారు. ఇందులో భాగంగా జూనియర్ వైద్య విద్యార్థి రాహుల్ రెడ్డిని పిలిపించుకున్నారు. మొదట బయోడాటా చెప్పించుకున్నారు. ఇలా 15 సార్లు బయోడాటాను మాటిమాటికి చెప్పించుకుని ఆ తర్వాత భౌతికంగా వేధించారు. బూతులు తిడుతూ ఇబ్బందులకు గురి చేశారు. నాలుగేళ్ల పాటు సీనియర్ల వేధింపులను తట్టుకుని నిలబడిన బాధితుడికి నాలుగేళ్లకు వేధింపులు తప్పకపోవడంతో పోలీసులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. వన్ టౌన్లో ఫిర్యాదు రాసివ్వడంతో ఆకతాయి చేష్టాలు చేసిన ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇందులో పాత్రధారులుగా ఉన్న మరికొంత మందిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు. రూమ్ నెంబర్ 302లో ఐదుగురు సీనియర్లతో పాటుగా మరికొంత మంది పాత్రధారులుంటే కేసులో వారి పేర్లను చేర్చడంపై పోలీసులు ఆలోచన చేస్తున్నారు. ఇదంతా జరిగినప్పుడు మెడికల్ కాలేజీ స్టాఫ్ ఎవ్వరూ గుర్తించకపోవడాన్ని పోలీసులు దృష్టి సారించాలని వైద్య విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. జీజీహెచ్‌లో ఈ తరహా వ్యవహారాలు ఇదేమి కొత్త కాదు. గతంలోనూ విద్యార్థుల మధ్య ఘర్షణపూరిత వ్యవహారాలు అనేకం వెలుగు చూశాయి. కుటుంబ కలహాలు, ఇతర కారణాలతో మెడికోలు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు వెలుగు చూసినప్పటికీ విద్యార్థులకు బుద్ధి రాకపోవడం శోచనీయంగా మారింది.