కామారెడ్డి, జూన్ 25 : చేనాటు తుపాకులు తరలిస్తున్న ముఠాను అరెస్టు సినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. ఈమేరకు తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఠాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గాంధారి పోలీసు స్టేషన్ పరిధిలోని మొండిసడక్ చౌరస్తా వద్ద బుధవారం రాత్రి ఆపరేషన్ కవచ్‌లో భాగంగా ఎస్సై మహేందర్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. రెండు మోటర్ సైకిళ్లపై వచ్చిన ఐదుగురు వాహన తనిఖీలను గమనించి పారిపోవడానికి యత్నించగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు.
వారి నుంచి నాటు తుపాకులు, గన్‌పౌడర్, పొటాష్, స్టీల్ పెలెట్స్, ఫెల్ట్స్ తదితర ప్రమాదకర వేట సామగ్రి లభ్యంకావడం, పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఎల్లారెడ్డి డీఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టగా పట్టుబడిన నిందుతులు అడవి జంతువుల వేట కోసం నాటు తుపాకులను కొనుగోలు చేసి వినియోగిస్తున్నట్లు తెలిసింది. జంతువుల వేటకు అటవీ ప్రాంతానికి వెళ్లగా వర్షం కురియడంతో వాతావరణం అనుకూలించక వెనుతిరుగు సమయంలో పోలీసులకు చిక్కినట్లు ఎస్పీ తెలిపారు. విస్లావత్ గోపిచంద్, అంగోతి లక్ష్మణ్, విస్లావత్ నాను, విస్లావత్ గణేశ్‌ను నిందితులుగా గుర్తించి, వారి నుంచి రెండు తుపాకులు, సామగ్రి, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
వీరు మూడు నెలల క్రితం అంగోత్ ధర్మ నాయక్, సలావత్ చందర్ మధ్యవర్తులుగా బాన్సువాడ మండలంలోని చిన్నరాంపూర్ గ్రామానికి చెందిన అస్లాం చావుస్ వద్ద నుంచి ఒక్కో నాటు తుపాకీని రూ.10 వేల చొప్పున కొనుగోలు చేశారు. మొత్తం ఐదు నాటు తుపాకీల్లో మూడింటికి ట్రిగ్గర్ మెకానిజం లేకపోవడంతో వాటిని గండిపేట్ తండా సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో దాచిపెట్టగా, పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
చిన్నరాంపూర్ గ్రామ సమీపంలోని ఒక కోళ్ల ఫారం వద్ద షెల్టర్ తీసుకుంటున్న మిగతా నిందితులైన సలావత్ చందర్, అంగోత్ ధర్మా నాయక్, అస్లాం చావుస్ మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి ఐదు నాటు తుపాకులు, ఒక ఎయిర్ గన్, మూడు ట్రిగ్గర్ మెకానిజమ్‌లు, 3 దాప్స్, స్టీల్ పెలెట్స్, గన్‌ఫౌడర్, పొటాష్, ప్లేట్స్‌తో పాటు సామగ్రి, రెండు మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరిచించిన పోలీసులు సంతోష్, పెంటయ్య, హోంగార్డు వీరప్రసాద్‌ను అభినందించి వారికి నగదు బహుమతులు అందజేశారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్ రావు, సీఐ సంతోష్ కుమార్, గాంధారి, తాడ్వాయి ఎస్సైలు మహేందర్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.