కంటేశ్వర్(నిజామాబాద్) : ఎర్రజొన్న, తెల్లజొన్న, పసుపు పంటల అమ్మకాలు ప్రారంభం కావడం వల్ల మార్కెట్ యార్డులల్లో క్రయ, విక్రయాలను నిశితంగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi Hanumanth ) అధికారులను ఆదేశించారు. జొన్న, పసుపు పంటల దిగుబడులు చేతికందుతున్న నేపథ్యంలో, గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖల అధికారులు, ట్రేడర్లు, విత్తన వ్యాపారులతో సమావేశం నిర్వహించారు.
పంట దిగుబడులను విక్రయించే విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రేడర్లు, సీడ్ వ్యాపారులు మార్కెట్ రేటుకు అనుగుణంగా ధరను చెల్లిస్తూ, రైతుల వద్ద నుంచి పంటను సేకరించేలా చూడాలన్నారు. జిల్లాలో ప్రస్తుత సీజన్ లో సాగు చేసిన జొన్న, పసుపు పంటల విస్తీర్ణం, పంట దిగుబడులు, ఎర్రజొన్న రైతులతో ఆయా కంపెనీల వ్యాపారులు కుదుర్చుకున్న ఒప్పందం, స్వేచ్ఛ విఫణిలో ఆయా పంటలకు లభిస్తున్న ధర, మార్కెట్ డిమాండ్ తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
రైతులతో కుదుర్చుకున్న బైబ్యాక్ ఒప్పందానికి కట్టుబడి తెల్లజొన్న, ఎర్రజొన్న కొనుగోళ్లు జరగాలని సూచించారు. రైతులు బయట మార్కెట్లో ఎక్కువ ధరకు ఇతర ట్రేడర్లకు పంట అమ్ముకోవాలని భావిస్తే వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని విత్తన వ్యాపారులకు సూచించారు. మార్చి నెల 15వ తేదీ వరకు మార్కెట్కు జొన్న, పసుపు పంట దిగుబడులు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు.
పసుపు పంటను బాగా ఆరబెట్టి తీసుకుని వచ్చేలా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని. తేమ శాతం కారణంగా రైతులు నష్టపోకూడదని సూచించారు. మార్కెట్ యార్డుకు పసుపు నిల్వలను రైతులు తీసుకువచ్చిన వెంటనే జాప్యానికి తావులేకుండా వెంటనే తూకం జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. డైరెక్ట్ పర్చేస్ సెంటర్ల ద్వారా రైతులు పంటలు విక్రయించేలా చూడాలన్నారు.
రైతులను మోసగించే చర్యలకు పాల్పడే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్, మార్కెటింగ్ శాఖ ఏడీ గంగవ్వ, ఏడీఏలు, ఏవోలు, పసుపు ట్రేడర్లు, విత్తన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.