కంఠేశ్వర్, ఏప్రిల్ 20 : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కుల గణనలో నాయక్‌పోడ్ జనాభాను తక్కువ చేసి చూపించారని ఆదివాసీ నాయక్‌పోడ్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గాండ్ల రాంచందర్, పుట్టా శివశంకర్ మండిపడ్డారు. ఈ మేరకు వారు సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టి, అనంతరం ప్రజావాణిలో ఫిర్యాదు చేసి మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జనాభా వివరాల్లో నాయక్‌పోడ్ తెగ జనాభా అతి తక్కువగా 16 వేలుగా తప్పుగా చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షలకు పైచిలుకున్న తమ జనాభాను కేవలం 16వేలుగా చూపడంపై తాము నిరసన వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో 29 మండలాల్లో నాయక్‌పోడ్ తెగ కుటుంబాలు సుమారు 4,392, జనాభా 35 వేలకు పైగా ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న జనగణనలో ఆదివాసీ నాయక్‌పోడ్ తెగకు ప్రత్యేకమైన కాలమ్ కేటాయించాలని కోరారు.