రాష్ట్రం పేరుపై ఏర్పడిన తెలంగాణ యూనివర్సిటీలో ఇక పాలన గాడిలో పడనున్నదా.. తొలినుంచి వివాదాలకు చిరునామాగా మారిన వర్సిటీ అభివృద్ధి పథంలో ముందుకెళ్లనున్నదా.. కొంతకాలంగా ఇన్చార్జి వీసీలతో పాలన కొనసాగగా.. ప్రభుత్వం ఎట్టకేలకు శాశ్వత వీసీని నియమించింది. నూతన వీసీగా ప్రొఫెసర్ టి. యాదగిరిరావు ఇటీవల నియమితులవగా.. ఈ నెల 21న బాధ్యతలు చేపట్టారు. ఏడాదిన్నర తర్వాత టీయూకు శాశ్వత వీసీ రావడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీలో పాలనను గాడిలో పెట్టడంతోపాటు విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తెచ్చేందుకు నూతన వీసీ తీసుకోనున్న చర్యలపై ఆసక్తినెలకొనగా.. ఇందులో రిజిస్ట్రార్ మార్పుకూడా ఉంటుందనే ఊహగానాలు వినిపిస్తుండడం గమనార్హం.
-నిజామాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పడి రెండు దశాబ్దాలకు చేరువవుతున్న ఈ కీలక సమయంలో ఐదో రెగ్యులర్ వీసీగా ప్రొఫెసర్ టి.యాదగిరి రావు రావడంతో ఆయన తీసుకోబోయే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కుంటుపడిన పరిపాలనను గాడిలో పెట్టడం, అవినీతి, అక్రమాలతో అపకీర్తిని తెచ్చుకున్న యూనివర్సిటీకి పూర్వ వైభవం తేవడం అనివార్యమైంది. వీసీ రావడంతో వర్సిటీలో జరిగే మార్పులు, చేర్పులపై భారీగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా రిజిస్ట్రార్ మార్పు తథ్యమన్న సంకేతాలు జోరుగా కనిపిస్తున్నాయి. ప్రొఫెసర్ యాదగిరి ప్రస్తుతం రిజిస్ట్రార్‌గా ఉన్నారు.
ఏడాది క్రితం పూర్వ వీసీ రవీందర్ గుప్తా ఆగడాల్లో భాగంగా టీయూలో ఏర్పడిన అలజడికి బ్రేక్ వేసేందుకు ప్రభుత్వం ప్రొఫెసర్ యాదగిరికి కీలక బాధ్యతలు అప్పగించింది. అనంతరం వీసీ జైలుకు పోవడంతో ఇన్చార్జి వీసీలుగా ముగ్గురు ఐఏఎస్ అధికారులు మారారు. రిజిస్ట్రార్‌గా మాత్రం యాదగిరి మాత్రమే కొనసాగుతూ ఆయన మార్గదర్శకంలోనే పరిపాలన సాగింది. కానీ గత ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం చేకూరలేదు. పైగా కాంగ్రెస్ సర్కారు ఆశిస్తున్న ఆశయం కూడా మరుగన పడుతోంది. టీయూ భూములను రక్షించడంలో ఏర్పడిన వైఫల్యం ఎవరూ పూడ్చలేని లోపంగా పరిగణించింది. ఈ దశలో టీయూకు నూతన రిజిస్ట్రార్ రావడం ఖాయమని తెలుస్తోంది.
రిజిస్ట్రార్ మార్పు అనివార్యం కానున్నది. ప్రొఫెసర్ యాదగిరి నియామకమై సుదీర్ఘ కాలం అవుతోంది. శాశ్వత వీసీని తొలగించిన తర్వాత ఇన్చార్జి వీసీ పాలన కాలంలో అన్నీతానై వ్యవహరించారు. దీంతో వర్సిటీలో పూర్తి స్థాయిలో పట్టు తెచ్చుకున్నప్పటికీ కీలకమైన అంశాల్లో వర్సిటీని గాడిలో పెట్టలేకపోయారన్న అపవాదును ఎదుర్కొంటున్నారు. రూ.కోట్లు విలువ చేసే భూముల రక్షణలో వైఫల్యతను మూటగట్టుకుంటున్నారు. జిల్లా యంత్రాంగంపై నెపాన్ని వేసి తప్పించుకుంటున్నప్పటికీ విద్యార్థులు, ఆచార్యులు, బోధనేతర సిబ్బంది అంతా కీలక బాధ్యతల్లో ఉన్న వ్యక్తినే బాధ్యుడిగా చూపిస్తున్నారు.
జాతీయ రహదారి పక్కనే ఉన్న టీయూ భూముల విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడితో ఏర్పడిన న్యాయపరమైన చిక్కుల్లో ప్రైవేటు వ్యక్తులదే పైచేయిగా నిలవడం ప్రతి ఒక్కరినీ కలవరపెడుతున్నది. కీలకమైన ఈ కేసు ను ఛాలెంజ్ గా తీసుకుని న్యాయస్థానాల్లో పోరా టం చే యాల్సిన సమయంలో జిల్లా యం త్రాం గం, టీయూ పెద్దలెవ్వ రూ అంతగా శ్రద్ధ చూపకపోవడంతో కోర్టులో ప్రైవేటు వ్యక్తులకు అనుకూలతలు ఏర్పడ్డాయి. సుప్రీంకోర్టులో ఈ కేసును సవాల్ చేసి భూములను తిరిగి చేజిక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగా వర్సిటీ పెద్దలు పూనుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ దశలో ప్రస్తుతం రిజిస్ట్రార్‌గా ఉన్న వ్యక్తిని మార్చి వేరొకరిని నియమించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మరోవైపు టీయూలోనే దశాబ్దాలుగా పని చేస్తున్న సీనియర్ ఆచార్యులంతా ఇదే విషయాన్ని తెర మీదకు తీసుకు వచ్చి రిజిస్ట్రార్‌గా అవకాశం దక్కించుకునే పనిలో నిమగ్నమయ్యారు.
టీయూలో విద్యా బోధన, పరిపాలన తీరు ఏ విధంగా ఉందో గడిచిన మూ డేండ్ల కాలంలో చోటుచేసుకున్న పరిణమాలతోపాటు రిజిస్ట్రార్ల మార్పు అంశాన్ని పరిశీలిస్తే సరిపోతుంది. గౌరవ మర్యాదలు లేకుండా నిబంధనలు అమలు జరుగకుండా జరిగిన విడ్డూరకరమైన పరిస్థితులు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. 2021, మే 22న తెలంగాణ యూనివర్సిటీకి వీసీగా ప్రొ.రవీందర్ గుప్తా నియమితులయ్యారు. వీసీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయనను తొలగించేంత వరకు ఇష్టానుసారంగా రిజిస్ట్రార్లను మార్చుకుంటూ పోయారు. వీసీగా వచ్చి రాగానే సెప్టెంబర్1న రిజిస్ట్రార్‌గా ఉన్న ప్రొ.నసీమ్‌ను తొలగించి ప్రొ.కనకయ్యకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు.
వివాదాస్పదంగా మారిన వీసీ రవీందర్ గుప్తా తీరుతో టీయూ పాలక మండలి 2021 అక్టోబర్ 30న యూనివర్సిటీలో సమావేశమై ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా ఉన్న కనకయ్యను తొలగించి యాదగిరిని రిజిస్ట్రార్‌గా నియమించింది. పాలక మండలి ఆదేశాలను ధిక్కరించి ప్రొ.శివశంకర్‌ను రిజిస్ట్రార్‌గా నియమించారు. తాను చెప్పినట్లు వినట్లేదని, సంతకాలు చేయట్లేదని భావించిన వీసీ ఏకంగా ప్రొ.శివశంకర్‌ను సైతం తప్పించి విద్యావర్ధినికి బాధ్యతలు అప్పగించారు. విద్యావర్ధిని నియామకాన్ని ఈసీ రద్దు చేసి ప్రొ.యాదగిరికి రిజిస్ట్రార్ బాధ్యతలను అప్పగించింది. రోజుల వ్యవధిలోనే ఓయూకు చెందిన మహిళా ప్రొఫెసర్‌ను రిజిస్ట్రార్‌గా వీసీ నియమించగా ఆ నిర్ణయాన్ని ఈసీ ఆపి తిరిగి ప్రొ.యాదగిరికి బాధ్యతలు అప్పగించగా ఆయనే ప్రస్తుతం కొనసాగుతున్నారు.