కటకటాల్లోకి వీసీ
‘గుప్తా’ధిపత్యంలో చిక్కుకున్న తెలంగాణ యూనివర్సిటీకి ఎట్టకేలకు విముక్తి లభించింది. అవినీతి, అక్రమాలు, వరుస వివాదాలతో వర్సిటీ పరవును బజారున పడేసిన వీసీ రవీందర్ గుప్తాకు ఏసీబీ ముకుతాడు వేసింది.
- రూ.50 వేలకు కక్కుర్తి పడిన ప్రొ.రవీందర్
- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం
- చంచల్‌గూడ జైలుకు తరలింపు వర్సిటీలో మిన్నంటిన సంబురాలు
- వీసీకి అంటకాగిన వారిపైనా ఏసీబీ నజర్
- సీవోఈ అరుణను హైదరాబాద్ నుంచి పిలిపించి మరీ విచారణ
తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రవీందర్ గుప్తా పాపం పండింది. విచ్చలవిడి దోపిడీకి పాల్పడిన ఆయనను ఏసీబీ కటకటాల్లోకి పంపింది. తద్వారా ‘గుప్తా’ధిపత్యంతో రెండేండ్లుగా సతమతమైన టీయూకి విముక్తి కల్పించింది. వీసీని అరెస్టు చేసి జైలుకు పంపించడంతో వర్సిటీలో సంబురాలు మిన్నంటాయి. ఇక, హైదరాబాద్‌లో సమావేశమైన ఈసీ కీలక నిర్ణయాలు తీసుకున్నది. ప్రొఫెసర్లు కనకయ్య, విద్యావర్ధినిని సస్పెండ్ చేయడంతో పాటు గతంలో పని చేసిన ముగ్గురు రిజిస్ట్రార్లపై విచారణ జరపాలని తీర్మానించింది. టీయూలో మరోమారు సోదాలు చేసిన ఏసీబీ అధికారులు పరీక్షల నియంత్రణాధికారి అరుణను సుదీర్ఘంగా విచారించారు.
నిజామాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘గుప్తా’ధిపత్యంలో చిక్కుకున్న తెలంగాణ యూనివర్సిటీకి ఎట్టకేలకు విముక్తి లభించింది. అవినీతి, అక్రమాలు, వరుస వివాదాలతో వర్సిటీ పరవును బజారున పడేసిన వీసీ రవీందర్ గుప్తాకు ఏసీబీ ముకుతాడు వేసింది. హైదరాబాద్‌లోని తన నివాసంలో శనివారం రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పొద్దున్నుంచి విచారించి సాయంత్రం వేళ అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలుకు తరలించారు
డబ్బులు ముట్టజెప్పినోళ్లకు ఏ ఉద్యోగమంటే ఆ ఉద్యోగం ఇచ్చేయడం, పైసలు ఇచ్చినోళ్లకు అడ్డగోలుగా జీతాల పెంపు, పదోన్నతులు, బదిలీలు చేపట్టడం, ప్రభుత్వ అనుమతి లేకుండానే వందలాది మందిని నియమించడం, అవసరం లేకున్నా జల్సాలకు రూ.కోట్ల నిధులు వెచ్చించడం, కోర్టు కేసుల్లో ఉన్న వ్యవహారాల్లో తలదూర్చి ఫైళ్లను కదిలించడం.. ఒకటేమిటి రెండేండ్ల కాలంలో వీసీ హోదాలో రవీందర్ గుప్తా చేయని అక్రమమంటూ లేదు. విద్యార్థుల భవిష్యత్తుతో పాటు వర్సిటీ పరువును రోడ్డున పడేసిన వీసీకి చివరికి అడ్డుకట్ట పడింది. ‘గుప్తా’ధిపత్యంలో తీవ్రమైన గందరగోళంలో ఊగిసలాడిన టీయూలో ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అదే సమయంలో రవీందర్ గుప్తా రూ.50 వేలకు కక్కుర్తి పడి ఏసీబీకి అడ్డంగా దొరికి పోయారు. వీసీ అరెస్టు కావడంతో టీయూలో సంబురాలు మిన్నంటాయి. వర్సిటీకి పట్టిన దరిద్రం పోయిందంటూ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తుండగా, గుప్తాతో కలిసి అక్రమాలకు పాల్పడిన వారిలో వణుకు మొదలైంది.
హైదరాబాద్ కేంద్రంగా శనివారం టీయూకి సం బంధించి రెండు కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. శనివారమే హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని రూసా బిల్డింగ్‌లో టీయూ పాలకవర్గం సమావేశమైంది. వీసీ అక్రమాలపై విచారణ కొనసాగించడం, నిధులు దుర్వినియోగానికి పాల్పడిన వారిని శిక్షించడం, రిజిస్ట్రార్ హోదాలో అనుమతి లేకుండా పని చేసి సంతకాలు పెట్టిన వారందరిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు గతంలో తీసుకున్న నిర్ణయాలపై శనివారం నాటి మీటింగ్‌లో ఏకవాక్య తీర్మానం చేసింది. ఇదే సమయంలో తార్నాకలోని తన నివాసంలో వీసీ రవీందర్ లంచం తీ సుకుంటూ ఏసీబీకి పట్టుబడడం కలకలం రేపింది.
అడ్డంగా దొరికిన వీసీ గుప్తా తన ఇంట్లో దీనంగా కూర్చుండి పోయారు. ఇన్నాళ్ల పాటు తన ఇంటినే అడ్డాగా చేసుకుని రూ.కోట్లు వసూలు చేసిన ఆయనకు ఊహించని షాక్ తగలడంతో కోలుకోలేకపోయినట్లు తెలిసింది. డబ్బులు తీసుకున్న కొద్దిసేపటికే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రసాయ న పరీక్షలు చేసి లంచం తీసుకున్నట్లు నిర్ధారించారు. ఆయనను అదుపులోకి తీసుకుని ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇంట్లో సోదా లు నిర్వహించగా దొరికిన పత్రాలను చూసి అధికారులు నిర్ఘాంతపోయారు. వర్సిటీలో అక్రమంగా వసూలు చేసిన సొమ్మునంతా వీసీ రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టినట్లుగా ఏసీబీ నిర్ధారించుకుంది. టీయూలో రూ.కోట్ల దుర్వినియోగం నిజమేనని తేలిన నేపథ్యంలో ఈ డాక్యుమెంట్లు కీలకం కానున్నాయి. ఇవన్నీ వీసీగా రవీందర్ గుప్తా బాధ్యతలు తీసుకున్నాక జరిపిన లావాదేవీలే ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చారు. ఎవరెవరు పెట్టుబడి పెట్టారన్న కోణంలో విచారణ సాగించేందుకు ఏసీబీ దృష్టి సారించనున్నది.
2021 మే 22న టీయూ వీసీగా బాధ్యతలు చేపట్టిన రవీందర్ గుప్తా ఏకంగా వ్యవస్థకే ఎదురు తిరిగారు. తనకు ఎదురే లేదని విర్రవీగారు. ప్రభుత్వం తనపై అజమాయిషీ చేయడం ఏమిటంటూ ప్రశ్నించారు. పాలకవర్గ సభ్యులను బెదిరించడం వంటి చర్యలకు సైతం దిగారు. ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి లక్షల్లో డబ్బులు వసూలు చేసి వందలాది మందిని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో నియమించారు. హైకోర్టు మెట్లెక్కి నానా యాగి చేద్దామని ప్రయత్నించి బొక్కబోర్లా పడ్డారు. జూన్ 15నాటి హైకోర్టు తీర్పుతో వీసీకి భయం పట్టుకుంది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన ఉన్నత న్యాయస్థానం టీయూలో ఆర్థిక పరమైన వ్యవహారాలకు సంబంధించిన హక్కులు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికే ఉంటాయని పేర్కొనడంతో వీసీ దిగొచ్చారు. ఆది నుంచి వివాదాస్పద నిర్ణయాలతో వర్సిటీని బజారున పడేసిన వీసీ.. విద్యార్థుల భవిష్యత్తును అసలే పట్టించుకోకుండా ఎంతసేపు రూ.కోట్లకు కోట్లు ఖర్చు చేయడంపైనే దృష్టి పెట్టారు.
డిచ్పల్లి, జూన్ 17: వీసీ రవీందర్ గుప్తా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడడంతో టీయూ పరిపాలనా భవనం, ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీసీని ఏసీబీ అధికారులు పట్టుకోవడం శుభపరిణామమని, ఈ ప్రక్రియ ఏడాది క్రితమే జరిగి ఉంటే కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయ్యేవి కావని అన్నారు. ఆలస్యంగానైనా అవినీతి వీసీని జైలుకు పంపడాన్ని విద్యార్థులంతా స్వాగతిస్తున్నారని తెలిపారు.
వీసీగా రవీందర్ నియామకమైనప్పటి నుంచి అవినీతి అక్రమాలకు టీయూ కే రాఫ్ అడ్రస్‌గా మారింది. అక్రమ ని యామకాలు, పరికరాల కొనుగోలు పేరుతో కోట్లాది రూపాయల నిధులను దుర్వినియోగం చేశాడు. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన వీసీని అరెస్టు చేయడం శుభపరిణామం.
-సంతోష్, అప్లాయిడ్ ఎకనామిక్స్, విద్యార్థి
ప్రభుత్వం వీసీ గత చరిత్రను తెలుసుకోకుండా నియమించడం పెద్ద తప్పు. అవినీతి ఆరోపణలతో గైడ్షీట్ను రద్దు చేశారు. బోధన సరిగా లేదని చాలాసార్లు మెమోలు సైతం ఇచ్చారు. విద్యార్థుల సొమ్మును కాజేసిన వీసీని కఠినంగా శిక్షించాలి. యూనివర్సిటీకి మంచి రోజులు వచ్చాయి.
ఒక ఉన్నతమైన హోదాలో ఉండి లంచం తీసుకోవడం చాలా పెద్ద తప్పిదం. విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయాల్సిందిపోయి అవినీతికి పాల్పడడం దురదృష్టకరం. దేశంలోనే ఎక్కడా ఇలా ఒక వీసీ అవినీతికి పాల్ప డడం చూడలేదు. భవిష్యత్తులో ఏ వీసీ కూడా ఇలా అవినీతికి పాల్పడకుండా ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలి.
ఏసీబీ అధికారుల దాడులను స్వాగతిస్తున్నాం. ప్రభుత్వం నియమించిన వైస్‌చాన్స్‌లర్ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయాల్సిందిపోయి డబ్బులు ఎలా సంపాదించుకోవాలో ఆలోచించే వారు. స్వీపర్ నుంచి మొదలుకొని ప్రొఫెసర్ల వరకు పని కోసం వెళితే డబ్బులు ఇస్తేనే సంతకం చేసేవాడు. ఇన్ని నెలలకు ఆయన పాపాల పుట్ట బహిర్గతమైంది.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

