పంట కోతలు ప్రారంభమైనా కొనుగోలు కేంద్రాల జాడ కరువైంది. సన్నవడ్లకు బోనస్ వస్తుందని ఆశపడ్డ రైతాంగానికి నిరాశే మిగిలింది. రాష్ట్రంలో బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లోనే ముందుగా వరి కోతలు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ చివరి నాటికే ధాన్యం రాశులు చేతికొస్తాయి. ప్రస్తుతం వరి కోతలు జోరందుకోగా, కొనుగోలు కేంద్రాలు పత్తా లేకుండా పోయాయి. దీంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వర్షాల ముప్పు నేపథ్యంలో దళారులకు అమ్ముకుంటున్నారు. గ్రామాల్లో వాలిపోతున్న రైస్‌మిల్లర్లు అన్నదాతల పరిస్థితిని అవకాశంగా తీసుకుని ధర తెగ్గోస్తున్నారు. మార్కెట్లో సన్నరకాలకు మంచి రేటు పలుకుతున్నా.. కనీస మద్దతు ధర కూడా ఇవ్వకుండా తక్కువ ధరకే ధాన్యం తరలించుకు పోతున్నారు. వర్షాల ముప్పు ఉందని భయపెడుతూ పచ్చి వడ్లను సైతం వదలకుండా తీసుకెళ్తున్నారు. ఇటు గిట్టుబాటు ధర రాక, అటు ప్రభుత్వం ఇస్తామన్న రూ.500 బోనస్ దక్కక రైతులు రెండు విధాలుగా నష్టపోవాల్సి వస్తున్నది.
-నిజామాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్ జిల్లాలో 1,46,895 హెక్టార్లలో సన్నరకం, 25,149 హెక్టార్లలో దొడ్డు రకం వడ్లను సాగు చేశారు. వానాకాలంలో నీటి లభ్యత, వాతావరణ పరిస్థితుల మేరకు హెక్టారుకు సన్నవడ్లు అయితే 6.84మెట్రిక్ టన్నులు, దొడ్డు రకమైతే 7.52 మెట్రిక్ టన్నులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 11,94,154 మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తుందని లెక్కగట్టింది. ఇందులో సన్న వడ్లే (10.49 లక్షల మెట్రిక్ టన్నులు) సింహభాగం కాగా, దొడ్డురకం వడ్లు 1.89 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఉంటుందని అంచనా.
స్థానిక అవసరాలకు 1.94లక్షల మెట్రిక్ టన్నులు మిగతా ధాన్యం బహిరంగ మార్కెట్‌కు వచ్చే అవకాశాలున్నాయి. 1.85లక్షల మెట్రిక్ టన్నులను ప్రైవేటు వ్యాపారులు సేకరించే అవకాశాలుండగా, మిగిలిన 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం 480 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
పీఏసీఎస్ ద్వారా 388, ఐకేపీ 52, డీసీఎంఎస్ 29, మెప్మా 6, కేపీపీఎస్ఎస్ఎస్ ఆధ్వర్యంలో 5 కేంద్రాలు నెలకొల్పనున్నారు. ధాన్యం సేకరణపై సీఎం రేవంత్‌రెడ్డి రెండ్రోజుల క్రితమే స్వయంగా సమీక్షించి పలు సూచనలు చేశారు. రైతుకు ఇబ్బందుల్లేకుండా చూడాలని ఆదేశించారు. కానీ, నిజామాబాద్‌లో పంట చేతికొచ్చినా యంత్రాంగం మాత్రం కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యాన్ని వీడడం లేదు.
రైతుల నుంచి ఇష్టపూర్వకంగా ధాన్యాన్ని సేకరించే అవకాశం రైస్ మిల్లర్లకు ఉంది. కానీ కనీస మద్దతు ధర కంటే తక్కువగా కొనుగోలు చేయడం కుదరదు. రైతును ముంచి లాభాలు ఆర్జించేందుకు కొంత మంది చిల్లర ఎత్తుగడలకు తెర లేపారు. రైస్ మిల్లర్ల సంఘంలో కీలక బాధ్యతలు నిర్వహించే ఓ వర్గం వ్యక్తులు నేరుగా రంగంలోకి దిగి రైతుల నుంచి పచ్చి వడ్లను సైతం తీసేసుకుంటున్నారు.
తద్వారా రైతులకు రూ.500 బోనస్ రాకుండా పోతున్నది. ఓ వైపు ఎమ్మెస్పీ లభించక, మరోవైపు బోనస్ లేక అన్నదాతలు రెండువిధాలుగా నష్టపోతున్నారు. మరోవైపు, ప్రైవేటు వ్యాపారులపై నిఘా కరువైంది. అధికార పార్టీ నేతల పేరు చెప్పుకుంటూ క్షేత్ర స్థాయిలో హల్చల్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం బాన్సువాడ, బోధన్, జుక్కల్ నియోజకవర్గాల్లో కోతలు జోరందుకుంటున్న వేళ ప్రభుత్వం దళారులకు ముకుతాడు వేయాలని అన్నదాతలు కోరుతున్నారు.