రామారెడ్డి, ఆగస్టు 25: సదాశివనగర్ మండలం పద్మాజివాడి ఎక్స్‌రోడ్డు వద్ద ఉన్న ఆర్ఎంపీ రాజిరెడ్డి నిర్వహిస్తున్న దవాఖానను డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ ఆదివారం సీజ్ చేశారు. సదరు ఆర్ఎంపీ ఇటీవల భూంపల్లి గ్రామానికి చెందిన చిన్నారులకు చికిత్స అందించిన నేపథ్యంలో దవాఖానలో తనిఖీలు చేశారు.
హైడోస్ మందులు, స్టెరాయిడ్స్ కనిపించడంతో దవాఖానను సీజ్ చేసినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. ఆర్ఎంపీలు, పీఎంపీలు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే నిర్వహించాలని సూచించారు. ఫీవర్ కేసులను వెంటనే ప్రభుత్వ దవాఖానలకు పంపించాలన్నారు. ఆర్ఎంపీలు ప్రథమ చికిత్సకు మించి ఎక్కువ వైద్యం చేసినట్లు నిర్ధారణ అయితే కేసులు నమోదుచేసి, చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.