కంఠేశ్వర్, ఫిబ్రవరి 9 : ఎర్రజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్ రేటుకు అనుగుణంగా ధరను చెల్లిస్తూ పంటను సేకరించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు సీడ్ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. ఎర్రజొన్న దిగుబడులు చేతికందుతున్న నేపథ్యంలో కలెక్టరేట్లో వ్యవసాయాధికారులు, విత్తన వ్యాపారులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రైతులతో కుదుర్చుకున్న బైబ్యాక్ ఒప్పందానికి కట్టుబడి కొనుగోళ్లు జరగాలని, రైతులు ఒకవేళ బయట మార్కెట్లో ఎక్కువ ధరకు పంట అమ్ముకోవాలని భావిస్తే వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు. జిల్లాలో ఎర్రజొన్న సాగు విస్తీర్ణం, పంట దిగుబడులు, ధరలు తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పంట రకాన్ని బట్టి క్వింటాలుకు రూ.3500 నుంచి రూ.4300 వరకు ధర లభిస్తుండగా..
తాము రైతులతో అదే విధంగా బైబ్యాక్ ఒప్పందం చేసుకున్నామని వివరించారు. పంట కోతలు ప్రారంభమయ్యాయని, పక్షం రోజుల తర్వాత పెద్ద ఎత్తున దిగుబడులు చేతికందుతాయని తెలిపారు. సీజన్ చివరి దశ వరకు కూడా క్వింటాలుకు కనీస మద్దతు ధరగా రూ.3500 వరకు చెల్లిస్తామని ట్రేడర్లు స్పష్టమైన హామీనిచ్చారు. రైతులు నష్టపోకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని వ్యవసాయాధికారులను కలెక్టర్ ఆదేశించారు. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి రైతులను మోసగించే చర్యలకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి వాజిద్ హుస్సేన్, ఏడీఏలు, ఏవోలు, విత్తన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.