కామారెడ్డి/ పెద్దకొడప్గల్/బాన్సువాడ టౌన్/బిచ్కుంద/ భిక్కనూర్, ఏప్రిల్ 3: హెచ్‌సీయూ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు గురువారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వర్సిటీ భూములను కాపాడాలని శాంతియుతంగా ఆందోళన చేపట్టిన హెచ్‌సీయూ విద్యార్థులపై లాఠీచార్జిని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పెద్దకొడప్గల్ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆదా యం కోసం ఆస్తులు అమ్ముకోవడం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ హటా వో తెలంగాణ బచావో అంటూ నినాదాలు చేశారు. వర్సిటీ విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు హైదరాబాద్‌కు వెళ్లడానికి సిద్ధమైన బాన్సువాడ మండల నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. బాన్సువాడ పోలీసుస్టేషన్‌కు తరలించారు.
భిక్కనూర్‌లో టీజీవీపీ (తెలంగాణ విద్యార్థి పరిషత్) నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గంధం సంజయ్ మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరనిఅన్నారు. హెచ్‌సీయూ భూమూల జోలికి రావొద్దని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు గంధం సంజయ్, నియోజకవర్గ ఇన్చార్జి ఎండీసమీర్ ఉన్నారు. హెచ్‌సీయూ భూముల వేలం నిలిపివేయాలని సచివాలయం ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అజయ్‌ను జుక్కల్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వర్సిటీ భూములను అమ్ముకుంటూ పోతే ఊరుకునేది లేదన్నారు. అర్ధరాత్రి అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు.
డిచ్పల్ల్లి, ఏప్రిల్ 3 : యూనివర్సిటీ భూములను అమ్ముతున్న సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం వారు హెచ్సీయూకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా అక్కడికి వెళ్లామని, శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థి నాయకులపై పోలీసులు లాఠీలతో దాడులు చేస్తున్నారని అన్నారు. విద్యార్థులకు శాంతియుతంగా నిరసన చేసే హక్కును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడంలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఉద్యమాన్ని ఎంత అణచివేసినా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మకుండా దేశమంతటా పోరాటం చేస్తామని హెచ్చరించారు.