వేల్పూర్: కుకునూర్ లిఫ్ట్, నవాబ్ లిఫ్టులను ప్రారంభించి చెరువులు నింపాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) అధికారులను ఆదేశించారు. ఎస్ఆర్ఎస్పీ (SRSP)లో పూర్తి స్థాయిలో నీళ్లు ఉండటంతో వెంటనే గుత్ప లిఫ్ట్, చౌటపల్లి హన్మంత్ రెడ్డి లిఫ్ట్ కుడా ప్రారభించాలన్నారు. కుకునూర్ గ్రామభివృద్ధి కమిటీ సభ్యులు మరియు నావాబ్ కమిటీ సభ్యులు వేల్పూర్‌లోని నివాసంలో ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా లిఫ్ట్ ప్రారభించి చెరువులు నింపడానికి ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. దీంతో ఇరిగేషన్ శాఖ అధికారులు సీఈ మధుసూదన్, ఈఈ భాను ప్రకాష్‌తో ఫోన్లో మాట్లాడారు. సీజన్ ప్రారభించకముందే మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు అన్ని సిద్ధంగా ఉన్నాయా అని ఆరాతీశారు. లేకపోతే చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు.
చిన్న చిన్న మరమ్మతులు ఉంటే వెంటనే పరిష్కరించి లిఫ్టులు ఆన్ చేయాలని ఆదేశించారు. కుకునూర్ లిఫ్ట్‌లో మోటార్లు ఇసుకలో కురుకుపోయాయని లిఫ్ట్ సభ్యులు తెలుపగా వెంటనే సమస్య పరిష్కరించి లిఫ్ట్ ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో 45 టీఎంసీలు ఉన్నప్పుడే చెరువులు నింపి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదన్నారు. ఇప్పుడు వందలాది టీఎంసీలు సముద్రం పాలయ్యాయని చెప్పారు. ఎస్ఆర్ఎస్పీలో పూర్తి స్థాయిలో నీళ్లు ఉన్నందున వెంటనే గుత్ప, చౌటపల్లి హన్మంత్ రెడ్డి లిఫ్టులు ప్రారభించి చెరువులు నింపాలని అధికారులను ఆదేశించారు. నిర్వహసన సరిగా లేకపోవడంతో వెంగంటి లిఫ్ట్ సంబంధించిన కాపర్ కాయిల్స్, ఇతర లిఫ్ట్ సామాగ్రి ఎత్తుకపోయారు. వాటిని రీస్టోర్ చేసి పల్లి కొండ లిఫ్ట్ కుడా ప్రారంభించాలని సూచించారు.