బోధన్, నవంబర్ 14: పట్టణ శివారులో బుధవారం సీఎం కేసీఆర్ పాల్గొననున్న ప్రజా ఆశీర్వాద సభ కోసం సర్వం సిద్ద్ధమైంది. వేలాదిమంది తరలివచ్చే ఈ సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. బోధన్ పట్టణ శివారులోని బోధన్ – నిజామాబాద్ ప్రధానరహదారి పక్కన అంబం గేట్ వద్ద విశాలమైన స్థలంలో ఈ సభను నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు బోధన్‌కు కేసీఆర్ రానున్నారు. సుమారు 70 వేల మందితో ఈ భారీ బహిరంగసభ నిర్వహించే దిశగా కొన్ని రోజులుగా బోధన్ ఏమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్, బీఆర్ఎస్ నాయకులు కృషిచేస్తున్నారు. సభా ప్రాంగణం అంతటా కుర్చీలు వేశారు. తాగునీటి సౌకర్యంతో పాటు అత్యవసర వైద్యచికిత్స కోసం ఏర్పాట్లు చేశారు. సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు వేదిక వెనుక భాగంలో హెలిప్యాడ్ నిర్మించారు. సభా ప్రాంగణం చుట్టూ కేసీఆర్, కేటీఆర్, కవిత ఫొటోలతో కూడిన భారీ కటౌట్లు, ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. సుమారు 70 వేల మందిని బోధన్ పట్టణం, వివిధ మండలాల నుంచి తరలించేందుకు బీఆర్ఎస్ నాయకులు క్షేత్రస్థాయిలో కృషిచేస్తున్నారు.
బోధన్‌లో సీఎం కేసీఆర్ పాల్గొనే ప్రజా ఆశీర్వాద సభాస్థలాన్ని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మంగళవారం పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి పోలీస్ అధికారులతో ఆయన సమీక్షించారు. సీపీ వెంట అడిషనల్ డీసీపీ గిరిరాజ్, బోధన్ ఏసీపీ కిరణ్‌కుమార్ ఉన్నారు. సీఎం రాక సందర్భంగా సభాస్థలం వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ సభాస్థలాన్ని సందర్శించి అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించారు.