ఇటీవల నియమితులైన టీచర్ల జాబ్లకు గ్యారంటీ లేకుండా పోయింది. కలల కొలువు సాధించామన్న సంతోషంలో ఉన్న అభ్యర్థులకు సర్కారు ఊహించని షాక్ ఇస్తున్నది. డీఎస్సీలో ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న కొందరిని ప్రభుత్వం అకారణంగా తొలగిస్తున్నది. మూడు వారాలుగా పాఠాలు బోధిస్తున్న టీచర్లను సాంకేతిక కారణాలు చూపి టర్మినేట్ చేస్తున్నది. జాబ్ వచ్చిందన్న సంతోషం కొన్నాళ్లు కూడా లేకుండా చేస్తున్నది. ప్రభుత్వ అసంబద్ధ వైఖరితో అభ్యర్థులు కుమిలి పోతున్నారు. ఉద్యోగం వచ్చిందని అందరికీ చెప్పుకున్నామని, ఇప్పుడిలా అర్ధాంతరంగా తొలగించడంతో తామేదో తప్పు చేశామన్న భావన అందరిలో కలుగుతుందని వాపోతున్నారు. సాంకేతిక కారణాలు చెప్పి ఇలా రోడ్డున పడేస్తే తమకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– నిజామాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్ విద్యాశాఖ పేరు చెబితేనే చీదరించుకునే పరిస్థితికి దిగజారింది. అడుగడుగునా అవినీతి, అక్రమాలకు నిలయంగా గత అధికారి మార్చేశారన్న అపవాదు ఉంది. కొంత మంది యూనియన్ లీడర్లకు ఊడిగం చేయడం, సామాన్య టీచర్లను వేధించారన్న ఆరోపణలు అనేకం ఉన్నాయి. తనిఖీలపేరుతో కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, ప్రభుత్వ స్కూళ్లలో హల్చల్ చేయడం ఆయనకే చెల్లింది. తనిఖీలకు వెళ్లినప్పుడల్లా లోపాలను గుర్తించి సరి చేయకుండా సస్పెన్షన్, మెమోల జారీ పేరిట బేరాలు కుదుర్చుకున్న దాఖలాలు సైతం ఉన్నాయి.
అలాంటి అధికారి హయాంలోనే ఉద్యోగాల భర్తీలోనూ గందరగోళం చోటు చేసుకున్నది. డీఎస్సీ 2024 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో చోటు చేసుకున్న పరిణామాలు అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వెరిఫికేషన్ అధికారులు తెలిసే తప్పులు చేశారా? లేదంటే పొరపాటున ఈ తప్పిదాలు చోటు చేసుకున్నాయా? అన్నది అనుమానాస్పదంగా మారింది. ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టే అర్హత పరీక్షనే ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తుంది. పరీక్షకు హాజరయ్యే లక్షలాది మందిపై నిఘా పెడుతుంది. అలాంటిది ఉద్యోగాల ఎంపిక చివరి ప్రక్రియలో ఇంత ఘోరమైన తప్పిదాలు చోటు చేసుకోవడం కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. డీఎస్సీ భర్తీ ప్రక్రియలో చోటు చేసుకున్న ఈ అయోమయానికి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు. అవసరమైతే లోతుగా విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ధర్పల్లి: మొన్నటి డీఎస్సీలో ఎస్జీటీగా సెలక్ట్ అయిన. హైదరాబాద్‌లో అపాయింట్మెంట్ కూడా ఇచ్చిండ్రు. ధర్పల్లి మండలంలోని దుబ్బాక ఒడ్డెర కాలనీలో గల ప్రాథమిక పాఠశాలలో పోస్టింగ్ ఇచ్చిండ్రు. జాబ్ వచ్చిందని కుటుంబ సభ్యులకు, బంధువులందరికీ చెప్పుకున్నా. సెప్టెంబర్ 16న జాబ్‌లో చేరా. ఏడాదిన్నర బాబును ఎత్తుకుని దుబ్బాక నుంచి ఒడ్డెర కాలనీకి రోజూ నడుచుకుంటూ వెళ్లి పిల్లలకు పాఠాలు చెప్పా. ఏం జరిగిందో ఏమో కానీ టెక్నికల్ ఇష్యూ వల్ల నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తున్నామని కాంప్లెక్స్ హెచ్ఎం జ్యోతిరాణి మేడం నా చేతిలో టర్మినేషన్ లెటర్‌ను పెట్టింది.
అది చూసి నా ప్రాణం పోయినంత పనైంది. టెక్నికల్ ఇష్యూ అని ఈజీగా చెప్పేసి చేతులు దులుపుకుంటున్నారు. మా పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించండి. మాది పేద కుటుంబం. ఎంతో కష్టపడి బీఈడీ చదివి, డీఎస్సీ రాసి ఉద్యోగం సాధించా. 23 రోజులు డ్యూటీ కూడా చేశా. అలాంటిది ఇప్పుడు రోడ్డున పడేస్తే ఏం చేయాలి? డీఎస్సీ అయ్యాక నాకు జాబ్ రాకుంటే రాలేదని ఊరుకునే దాన్ని. జాబ్ వచ్చి డ్యూటీలో చేరాక ఇప్పుడు తొలగిస్తే ఎట్ల? తెలిసిన వాళ్లేమో నువ్ ఏదో తప్పుచేశావు అందుకే తీసేశారని అంటుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. అధికారులు ఎందుకిలా నా జీవితంతో అడుకుంటున్నారో అర్థమైతలేదు. చేయని తప్పుకు ఎందుకు శిక్ష? అధికారులు నాకు ఉద్యోగమైనా ఇప్పించాలి లేదా నాకు చావైనా ప్రసాదించాలి.
– ఉట్నూర్ లావణ్య, అమ్రాద్ గ్రామం, మాక్లూర్ మండలం
ఖలీల్‌వాడి: డీఎస్సీ 2024లో నేను స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ (తెలుగు)గా ఎంపికయ్యా. హైదరాబాద్‌కు తీసుకెళ్లి అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చారు. కానీ పోస్టింగ్ ఇవ్వలేదు. పోస్టింగ్ కోసం డీఈవో ఆఫీసు చుట్టూ తిరుతుంటే హోల్డ్‌లో పెట్టారని సమాధానమిచ్చారు. ఎందుకు అలా అని ప్రశ్నిస్తే సాంకేతిక లోపమని చెప్పారు. ఉద్యోగం వచ్చిందన్న సంతోషం కూడా లేకుండా పోతున్నది. ఇప్పుడేమో ఈ నెల 20 నుంచి జరిగే రీ వెరిఫికేషన్‌కు రమ్మని చెబుతున్నారు. అపాయింట్ మెంట్ ఇచ్చాక ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థమైతలేదు.
– ఉడుత నవత, నిజామాబాద్
యువత జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నది. ఉద్యోగాలు ఇచ్చినట్లే ఇచ్చి రద్దు చేస్తూ అభ్యర్థులను తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తున్నది. డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్లు, పోస్టింగ్‌లు ఇచ్చాక, ఇప్పుడేమో తొలగిస్తున్నది. నిజామాబాద్ జిల్లా విద్యాశాఖలోని కొంతమంది అధికారుల తీరు వల్లే ఈ గందరగోళం చోటు చేసుకున్నది. కొందరి నిర్లక్ష్యం మూలంగా ఉద్యోగాలు వచ్చినట్లే వచ్చి కోల్పోయిన ఆడబిడ్డలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వారి జీవితాలతో విద్యా శాఖ చెలగాటం ఆడడంతో సమాజంలో చిన్నచూపునకు లోనవుతున్నారు.
సాంకేతిక కారణాలను బూచీగా చూపి ఉద్యోగాలు రద్దు చేయడం పక్కన పెడితే… అర్హత లేనప్పుడు సదరు అభ్యర్థుల పేర్లు నియామక జాబితాలోకి ఎలా వచ్చాయన్నది ఇప్పుడు దుమారం రేపుతున్నది. సులువుగా సాంకేతిక తప్పిదంతో విద్యా శాఖ తప్పించుకుంటున్నప్పటికీ, తప్పిదాలు చేసిన అధికారులపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదన్నది అంతులేని ప్రశ్నగా మారింది. ఉద్యోగాలిచ్చి వారితో రోజుల పాటు పని చేయించుకుని ఉన్న పళంగా రోడ్డున పడేయడం ద్వారా నిజామాబాద్ జిల్లా యంత్రాంగం పనితీరు
ఏ పాటిదో మరోసారి రుజువైంది.
డీఎస్సీ 2024 ఫలితాలు సెప్టెంబర్ 30న విడుదలయ్యాయి. అక్టోబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో నియామక పత్రాలను అందించారు. ప్రభుత్వ ఆదేశాలతో నిజామాబాద్ జిల్లా విద్యా శాఖ అధికారులు 640 పోస్టులకు గాను 452 మందిని ఎంపిక చేసి జాబితాను ప్రభుత్వానికి సమర్పించారు. మిగిలిన 88 పోస్టులను భర్తీ చేయలేదు. ఇందుకు సవాలక్ష కారణాలను చూపించారు. కమ్మర్పల్లి మండలం చౌట్పల్లిలో కృష్ణ చైతన్యకు సోషల్ సబ్జెక్ట్‌లో దివ్యాంగుల కోటాలో 780 ర్యాంక్ వచ్చింది.
ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకాగా, అతడ్ని వెరిఫికేషన్‌లో పక్కనపెట్టి ఆయన కన్నా ఎక్కువ ర్యాంకు వచ్చిన వ్యక్తికి ఉద్యోగం ఇచ్చారు. దాదాపు వందకు పైగా ర్యాంకుల మధ్య తేడా ఉన్న మరో వ్యక్తికి ఉద్యోగం ఇవ్వడం తీవ్ర దుమారం రేపింది. తమ తప్పిదాలను కప్పి పుచ్చుకునే క్రమంలో దివ్యాంగ కోటాలో అర్హత సంపాదించిన కృష్ణ చైతన్యపైనే విద్యాశాఖ బాధ్యులు నిందలు మోపారు. వెరిఫికేషన్‌కు రాలేదంటూ బుకాయించారు. తీరా సీన్ కట్ చేస్తే పరిశీలన అనంతరం తిరిగి 780 ర్యాంక్ వచ్చిన కృష్ణ చైతన్యకు ఇప్పుడు జాబ్ వచ్చింది.