కంఠేశ్వర్/ కామారెడ్డి, ఫిబ్రవరి 26: నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనున్నది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనున్నది. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో పోలింగ్ సామగ్రిని అధికారులు పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, కామారెడ్డిలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ బుధవారం సందర్శించారు.
ఎన్నికల సామగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలింగ్ సిబ్బందితో పాటు ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ఆర్టీసీ బస్సులను పరిశీలించి, సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
నిజామాబాద్, ఆర్మూర్ ఆర్డీవో కార్యాలయాలతో పాటు బోధన్ సబ్‌కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికల సిబ్బందికి అందించినట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగేలా అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఉంటుందని తెలిపారు. ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు అదనపు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఓటు కలిగి ఉన్న వారు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఉత్కంఠగా మారిన పోరు
ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో పోరు ఉత్కంఠగా మారింది. బీజేపీ నుంచి అంజిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నరేందర్‌రెడ్డి, బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ తదితరులు బరిలో నిలిచారు.