నిజామాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో పోలీసులే దొంగలతో చేతులు కలిపిన వైనం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో వెలుగు చూసింది. అక్రమార్కులతో అంటకాగి ట్రాక్టర్లు, టిప్పర్లకు బేరాలు మాట్లాడుకుంటూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇలా రోజులు, గంటలను లెక్కపెట్టుకుంటూ ట్రిప్పుకు ఒక రేటు చొప్పున దోపిడీ పర్వాన్ని కొనసాగించారు. ఇష్టానుసారంగా ఇసుక దోపిడీకి పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన పోలీసులు, అధికారుల తీరుతో నిజామాబాద్ కమిషనరేట్ పరువు మరోసారి బజారున పడింది. మొన్నటి మొన్న టాస్క్‌ఫోర్స్ విభాగం తీరుతో పరువు మంట కలిసిన దరిమిలా ప్రస్తుతం అవినీతి పోలీస్ అధికారుల చిట్టాతో మరోసారి ఖాకీలకు మరకలు అంటుకున్నాయి. స్వయంగా డీజీపీ కార్యాలయం నుంచి 12 మంది పోలీస్ అధికారులపై వేటు వేయాలని ఆదేశాలు వచ్చినప్పటికీ ఇంతవరకూ వారి జోలికి వెళ్లకుండా కమిషనరేట్ అధికారులు చోద్యం చూస్తుండడం విడ్డూరంగా మారింది. ఇద్దరు సీఐలు, 11 మంది ఎస్సై స్థాయి అధికారుల లీలలపై స్వయంగా డీజీపీకి చిట్టా వివరాలు వెళ్లగా.. సీరియస్‌గా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చారు. మల్టీ జోన్-2లో ఇప్పటి ఇసుక అక్రమార్కులతో చేతులు కలిపిన ఖాకీలను సస్పెన్షన్ వేటు వేయగా.. మల్టీ జోన్ -1లోని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని మకిలీ పోలీసులపై మాత్రం చర్యలు శూన్యమయ్యాయి.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో డీజీపీ ఆదేశాల అమలుకే దిక్కూ మొక్కూ లేకుండా పోయింది. స్వయంగా డీజీపీ జారీ చేసిన మెమోరాండాన్ని ఆధారంగా చేసుకుని ఖాకీ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా చర్యలు మాత్రం శూన్యమయ్యాయి. ఇదేంటని అడిగేవారు లేకపోవడంతో ఉన్నతాధికారుల తీరుపై సర్వత్రా చర్చ నడుస్తున్నది. నెల క్రితం వరకు పోలీస్ కమిషనర్‌గా కల్మేశ్వర్ సింగెనవార్ పనిచేశారు. ఈ ఉత్తర్వులు ఆయన ఉన్నప్పుడు జారీ అయినట్లుగా పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. ఆకస్మికంగా ఆయన బదిలీ కావడంతో కామారెడ్డి ఎస్పీ సింధూశర్మకు నిజామాబాద్ సీపీగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అక్రమార్కులపై శాఖాపరమైన విచారణ చేయాలని డీజీపీ ఆదేశాలు ఇవ్వడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. సీఐలు, ఎస్సైలపై చర్యలకు ఐజీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ కాగా అమలుకావడంలో జరుగుతున్న జాప్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు ఒక నీతి, సామాన్యులకు ఒక నీతి ఉంటుందా? అన్న ప్రశ్న ప్రజల్లో కలుగుతున్నది. పోలీస్ బాస్‌లు కీలకమైన చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తుండడం ఏమిటంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది పోలీసులు ఆయా ఠాణాల నుంచి బదిలీలు జరిగి వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. కానీ వారిపై వసూళ్లకు సంబంధించిన కేసుల్లో మాత్రం ఎలాంటి వేటు పడకపోవడం శోచనీయంగా మారింది.
సహజ వనరుల దోపిడీని అరికట్టడంలో మైనింగ్, రెవెన్యూ అధికారులతోపాటు పోలీసులకు సైతం బాధ్యత ఉంటుంది. కానీ పోలీసులు మాత్రం రోడ్లు ఎక్కి ఇసుక వాహనాలను పట్టుకుని, బేరం ఆడుకుని జేబులు నింపుకొనేందుకే ఎగబడుతున్నారు. ఇందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని 12 మంది పోలీస్ అధికారుల అవినీతి బాగోతం నిదర్శనంగా నిలుస్తున్నది. వీరి వసూళ్ల పర్వంపై డీజీపీకి ఫిర్యాదులు అందగా రహస్యంగా విచారణ చేయించారు. నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు అవినీతి పరుల జాబితాను రూపొందించి చర్యలకు ఆదేశాలు జారీచేశారు. అందులో ఒక్కొక్కరి బాగోతాలను పరిశీలిస్తే ముక్కున వేలేసుకోవడం ఖాయం. ప్రస్తుతం బదిలీలపై వివిధ ప్రాంతాలకు వెళ్లిన సదరు పోలీసుల అవినీతి చిట్టా గమనిస్తే నెల వారీగా ఇసుక వాహనాల నుంచి ఎస్సైలు, సీఐలు వసూళ్లు చేస్తున్న తీరును చూసి ఆశ్చర్య పోవాల్సిందే. జక్రాన్‌పల్లి ఎస్సై ట్రాక్టర్‌కు రూ.20 వేలు, ఇందల్వాయి ఎస్సై ట్రాక్టర్‌కు రూ.10 వేలు, ధర్పల్లి ఎస్సై ట్రాక్టర్‌కు రూ.15 వేలు, సిరికొండ ఎస్సై ట్రాక్టర్‌కు రూ.10 వేలు, కోటగిరి ఎస్సై ట్రాక్టర్‌కు రూ.10 వేలు నుంచి రూ.20 వేలు, వర్ని ఎస్సై ట్రాక్టర్‌కు రూ.20 వేలు (వారం క్రితం రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు), బోధన్ రూరల్ ఎస్సై ఏకంగా లింగ్డాపూర్ శివారు నుంచి రూ.6 లక్షలు, హంగర్గా శివారు నుంచి రూ.8 లక్షల చొప్పున వసూళ్లు, బోధన్ టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు నెలకు రూ.2 లక్షలు, ఇతర వాహనాలకు రూ.50 వేలు, రెంజల్ ఎస్సైకి వాహనానికి రూ.10 వేలు, భీంగల్ ఎస్సైకి రూ.70 వేలు, మాక్లూర్ ఎస్సై రూ.10 వేల చొప్పున వసూళ్లు చేశారు.