ఎల్లారెడ్డి రూరల్, డిసెంబర్ 19: ప్రజలకు పోలీసు సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని అడిషనల్ ఎస్పీ అన్యోన్య అన్నారు. పట్టణంలో సోమవారం నిర్వహించిన నూతన డీఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. డీఎస్పీ శ్రీనివాసులును సీటులో కూర్చోబెట్టారు. అనంతరం విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ అన్యోన్య మాట్లాడారు. బస్టాండ్ సమీపంలో ఇప్పటివరకు ఉన్న కార్యాలయం స్థలంలో సమీకృత మార్కెట్ నిర్మిస్తున్న దృష్ట్యా కార్యాలయాన్ని మార్చాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.
నిజాంసాగర్ రోడ్లోకి నూతన డీఎస్పీ కార్యాలయాన్ని మార్చినట్లు తెలిపారు. ఆఫీసులోనే క్యాంపు కార్యాలయం ఉండడంతో డీఎస్పీ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే అవకాశం ఉందన్నారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. కొత్త కార్యాలయం ప్రశాంతమైన వాతావరణంలో ఉండడం సంతోషమన్నారు. కార్యాలయం ప్రారంభించడానికి వచ్చిన అడిషనల్ ఎస్పీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎటువంటి సమస్యలు వచ్చినా ఎలాంటి సందేహాలు లేకుండా నిరభ్యంతరంగా స్టేషన్కు వచ్చి పరిష్కరించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి సీఐ శ్రీనివాస్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, సదాశివనగర్, గాంధారి, తాడ్వాయి ఎస్సైలు ఆంజనేయులు, రాజేశ్, ఆంజనేయులు, రాజేశ్, ఎల్లారెడ్డి పోలీస్స్టేషన్, డీఎస్పీ కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.