దేశాభివృద్ధి మహిళల చేతుల్లోనే..
స్వయం శక్తితో మహిళలు ముందుకు సాగాలి
వాయిస్ ఆఫ్ గర్ల్స్ ముగింపు కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
బాన్సువాడ రూరల్, డిసెంబర్ 23 : ప్రతి ఆడబిడ్డా విద్యావంతురాలు కావాలని, అప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని కొయ్యగుట్ట సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేసిన ‘వాయిస్ ఆఫ్ గర్ల్స్’ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం దేశ జనాభాలో సగం మంది మహిళలు ఉన్నారని, మహిళలు ఇతరులపై ఆధారపడకుండాస్వశక్తితో నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగాలన్నదే వాయిస్ ఆఫ్ గర్ల్స్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని గుర్తు చేశారు. సమాజంలో రాణించాలంటే మానసిక, శారీరకశక్తి అవసరమని, మానసిక శక్తి మీరు అనుకున్న రంగంలో మిమ్మల్ని గమ్యానికి చేరిస్తే, శారీరక శక్తి మీకు మీరు కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు.
అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్యావంతులైన ఆడబిడ్డల కుంటుంబం ఆర్థికంగా బాగుంటుందన్నారు. ప్రతి ఆడబిడ్డా తప్పకుండా చదువుకోవాలని సూచించారు. కుటుంబ ఆర్థిక స్థితిగతులను మార్చే శక్తి మహిళలకు ఉందని తెలిపారు. మహిళలు చేసే పనిలో సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగాలని, సరైన జీవిత భాగస్వామిని నిర్ణయించుకునే ధైర్యం, స్వతంత్రత మహిళలకు రావాలన్నారు. ఆడబిడ్డకు విద్యను అందించాలనే సంకల్పం, దూర దృష్టితో బాన్సువాడ నియోజకవర్గంలో బాలికల గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామని తెలిపారు. కొయ్యగుట్ట, బోర్లం క్యాంపులో రెండు సాంఘిక సంక్షేమ బాలిలకల గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాన్సువాడ ప్రాంతంలో బాలికల కోసం పాఠశాలలు, కాలేజీలు, గురుకుల పాఠశాలలతో పాటు ఈ ఏడాది బాలికల ఉర్దూ మీడియం డిగ్రీ కళాశాల మంజూరు చేయించామన్నారు. త్వరలోనే ఎస్టీ బాలికల గురుకుల పాఠశాల మంజూరు కాబోతున్నదని తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వాల వంతని, వాటిని సద్వినియోగం చేసుకోవడం విద్యార్థుల వంతని అన్నారు. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వివరించారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని గీసిన స్పీకర్ పోచారం దంపతుల చిత్రాన్ని పటాన్ని స్పీకర్‌కు అందించింది. కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్, ప్రిన్సిపాల్ శోభారాణి, ఎంపీపీ దొడ్ల నీరజావెంకట్‌రాంరెడ్డి, జడ్పీటీసీ పద్మాగోపాల్రెడ్డి, సర్పంచ్ కుమ్మరి రాజమణి, భగవాన్‌రెడ్డి, హకీం, తదితరులు పాల్గొన్నారు.
దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు వర్థంతి సందర్భంగా స్పీకర్ కొయ్యగుట్ట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో పీవీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.