Pochaaram Srinivas Reddy | నస్రుల్లాబాద్ మార్చ్ 28: నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ ప్రాథమిక సహకార సంఘ పరిధిలోని తిమ్మాపూర్, బీర్కూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. కామారెడ్డి జిల్లాలో ప్రథమంగా తిమ్మాపూర్, బీర్కూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కోతకు వచ్చిన వరి పంటను కోసి ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తరలించాలని రైతులకు సూచించారు. ధాన్యాన్ని రైస్ మిల్లర్లకి అలాట్మెంట్ చేసేలా కలెక్టర్ తో మాట్లాడి వెంటనే ఏర్పాటు చేసేలా చూడాలని సబ్ కలెక్టర్ కిరణ్మయికి ఆయన సూచించారు.
మాట్లాడుతున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి
రైతులు దళారుల చేతిలో మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే విక్రయించాలన్నారు. ప్రభుత్వం ఏ-గ్రేడ్ కు రూ.2320, బీ-గ్రేడ్ కు రూ.2300 చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో ఐదు టీఎంసీల నీటిని ఉంచి వచ్చే పంటకు జూన్ మాసంలో నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు నష్టం జరగకూడదని, పండించిన ప్రతీ గింజను ప్రభుత్వ కొనుగోలు చేస్తుందన్నారు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉన్న సన్నరకం ధాన్యానికి ప్రోత్సాహకరంగా క్వింటాలుకు రూ.500 బోనస్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.
రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, బీర్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల, విండో చైర్మన్లు హనుమంతరావు, నాయకులు పెరిక శ్రీనివాస్, అప్పారావు, పల్లికొండ సాయిబాబా, నరసరాజు, తహసీల్దార్ లత, ఎంపీడీవో భాను ప్రకాష్, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.