కామారెడ్డి రూరల్, ఆగస్టు 2: బతికున్న వ్యక్తి చనిపోయినట్లు ఫేక్ సర్టిఫికెట్ సృష్టించి దొంగతనంగా ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసిన కేసులో కామారెడ్డి పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నివాసముండే నరాల జీవన్‌రెడ్డికి అశోక్‌నగర్ కాలనీలో 200 గజాల ప్లాట్ ఉంది. అయితే, గత నెల 26న ఆ ప్లాట్‌ను మహ్మద్ సాజిద్ హుస్సేన్ ట్రాక్టర్‌తో చదును చేసేందుకు రాగా, విషయం తెలుసుకున్న జీవన్‌రెడ్డి అక్కడికి వెళ్లాడు.
నా ప్లాట్‌ను ఎందుకు చదును చేయిస్తున్నావని ప్రశ్నించగా, నిజామాబాద్ వాసి అబ్దుల్ మోసి ఈ ప్లాట్‌ను కొనుగోలు చేశాడని, అందుకు సంబంధించిన కొన్ని పత్రాలను చూయించాడు. 2012లోనే ప్లాట్ ఓనర్ జీవన్‌రెడ్డి చనిపోయినట్లు ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించి, ఆయన కుమార్తె బగ్గల స్రవంతి సెల్ఫ్ అఫిడవిట్ ద్వారా కామారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసిన సేల్‌డీడ్ డాక్యుమెంట్ చూసి జీవన్‌రెడ్డి షాకయ్యాడు.
తాను చనిపోయినట్లు తప్పుడు పత్రాలు సృష్టించడంతో పాటు తన కూతురి స్థానంలో వేరొకరిని తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించారని, దీనిపై చర్యలు తీసుకోవాలని జీవన్‌రెడ్డి కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వ్యవహారంతో సంబంధమున్న మహమ్మద్ అబ్దుల్ మోసి, స్రవంతి, మహ్మద్ నబిని అరెస్టు రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు.