కామారెడ్డి, సెప్టెంబర్ 24: కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జీవదాన్ పాఠశాలలో చదివే ఆరేండ్ల బాలికపై పీఈటీ నాగరాజు అత్యాచారయత్నం చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో మంగళవారం స్కూల్ ఎదుట తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీలు ఝళిపించారు. అడిషనల్ కలెక్టర్, ఎస్పీ వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు.
కామారెడ్డిలోని జీవదాన్ పాఠశాలలో పీఈటీగా పనిచేసే నాగరాజు.. అదే స్కూల్లో చదివే ఆరేండ్ల బాలికపై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. దీంతో భయపడిన బాలిక బడికి వెళ్లనని మారం చేసింది. ఏమైందని తల్లిదండ్రులు ఆరా తీయగా, బాలిక జరిగిన విషయం చెప్పింది. దీంతో నిర్ఘాంతపోయిన తల్లిదండ్రులు సోమవారం పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలికపై అఘాయిత్యం విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు మంగళవారం స్కూల్ ఎదుట ఆందోళనకు దిగాయి.
మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ కూడా వచ్చి వారితో జత కలిశారు. ఈ విషయం తెలిసి బాలిక తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో స్కూల్‌కు వచ్చి అక్కడున్న అద్దాలు, వస్తువులను ధ్వంసం చేశారు. ప్రిన్సిపాల్ చాంబర్లోకి దూసుకెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. డీఎస్పీ నాగేశ్వర్రావు, సీఐ చంద్రశేఖర్‌రెడ్డి ఎంత చెప్పినా వినలేదు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు విసిరారు. సీఐ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు ఎస్సై రాజారాం, మరికొందరికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి అక్కడున్న వారిని చెదరగొట్టారు.
పరిస్థితి చేయి దాటుతుండడంతో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి అక్కడకు చేరుకుని బాధితులతో మాట్లాడి శాంతింపజేశారు. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు పాఠశాల ఆవరణలో నాలుగు గంటలకు పైగా శాంతియుతంగా ఆందోళన చేశారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్పీ సింధూశర్మ అక్కడకు చేరుకుని బాధితులు, విద్యార్ధి సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. పీఈటీ నాగరాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేయగా, వారు అంగీకరించారు. నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.