రుద్రూర్, సెప్టెంబర్ 23: వానకాలంలో సాగు చేసిన వరి పంటపై తెగుళ్ల దాడి ఉధృతంగా ఉన్నది. వాతావరణ మార్పుల కారణంగా ఎండాకు తెగులు, దోమపోటు తీవ్రంగా ఆశిస్తున్నది. చీడపీడలు ఆశించడం వలన దిగుబడి పడిపోతుంది. కళ్ల ముందే ఎండిపోతున్న పంటను చూసి రైతాంగం ఆందోళన చెందుతున్నది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో కనిపిస్తున్న చీడపీడల్లో ఎండాకు తెగులు చాలా ప్రమాదకరమైనది. ఇది దీర్ఘకాలిక రకాలను వరి పంట దుబ్బ కట్టే దశలో ముఖ్యంగా సన్నగింజ రకాల్లో ఈ అధికంగా ఆశిస్తుంది. ఈ తెగులుకు మందు లేదని, లక్షణాలను తొలి దశలొనే గుర్తించి చర్యలను పాటిస్తే నివారించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
సాధారణంగా వరికి ఎండాకు తెగులు ఆశించినప్పుడు ఆకుల మీద పసుపు రంగు నీటిమచ్చలు ఏర్పడి, అంచుల వెంబడి అలల మాదిరిగా పై నుంచి కిందికి వ్యాప్తి చెందుతుంది. తెగులు సోకిన మొక్కలను ఉదయం వేళ గమనిస్తే ఆకుల నుంచి పచ్చని జిగురులాంటి పదార్థం పైకి వస్తుంది. ఈ పదార్థం సూర్యరశ్మికి గట్టిపడి చిన్న చిన్న ఉండలుగా మారి, గాలి వీచినప్పుడు ఆకు నుంచి నీటిలో పడిపోతాయి. కిందపడిన ఉండ లు నీటి ద్వారా మరో మొక్కకు, ఇతర మడులకు వ్యాపిస్తుంది. వరి ఈనే దశలో తెగులు వ్యాపిస్తే ఆకుల్లో హరిత పదార్థం తగ్గడంతోపాటు వెన్నులు పాక్షికంగా బయటికి వస్తాయి. దీంతో గింజ పాలుపోసుకోదు. ఈ తెగులు లక్షణాలు ఎక్కువగా చెట్టు నీడన ఉన్న పొలాల్లో ఎక్కువగా కనబడుతుంది.
గాలిలో తేమ శాతం అధికంగా ఉండడం, ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు కురవడం, అధిక వేగంతో గాలులు వీయడం, సగటు ఉష్ణోగ్రతలు 22-26 సెంటిగ్రేడ్ మధ్య ఉంటే ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. రైతులు అధిక మోతాదులో నత్రజని ఎరువులను వినియోగించడం కూడా ఈ తెగులు ఉధృతికి కారణమని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.
రైతులు పొలాన్ని ఎప్పటికప్పుడు గమనించి, ఎండాకు తెగులు లక్షణాలు 5 శాతం కన్నా ఎక్కువ అయితే నత్రజని ఎరువును వేయడం తాత్కాలికంగా నిలిపివేయాలి. ఈ తెగులు సాగునీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. కావున ఆశించిన పొలం నుంచి ఇతర పొలాలకు నీరు పారకుండా చేయాలి. పొటాష్ ఎరువును దమ్ములో, ఆకరి దఫాలో ఎకరాకు 15 కిలోల చొప్పున వేయాలి.
ప్రతి ఏడాది ఈ తెగులు స్థానికంగా ఆశిస్తే ఆ ప్రాంతాల్లో ఇంట్రాస్టు సాంబామసూరి అనే తెగులు తట్టుకొనే (ఆర్పిబయో 226) రకాన్ని సాగుచేయాలి. తెగులు లక్షణాలు దుబ్బ కట్టే దశ నుంచి చిరు పొట్ట దశలో గమనిస్తే కాఫర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు, ప్లాంటామైసిన్ లేదా పోషామైసిన్ లేదా ఆగ్రిమైసిన్ 0.4 గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే తెగులు వ్యాప్తిని కొంతవరకు నియంత్రించవచ్చు. ఈ తెగులును పూర్తిగా నివారించడానికి ఎలాంటి మందులు అందుబాటులో లేవు. సమగ్ర ఎరువుల యాజమాన్యంతో పాటు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
పంటలను రైతులు ఎప్పటికప్పుడు పరిశీలించాలి. వరిలో ఎండాకు తెగులు బ్యాక్టీరియా వ్యాప్తి చెందినప్పుడు వ్యవసాయ ధికారులు లేదా సంబంధిత శాస్త్రవేత్తలను సంప్రదించి సలహాలు తీసుకొని, తగిన చర్యలు చేపడితే పంట నష్టాన్ని అధిగమించవచ్చు. లేకపోతే తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
– విజయ్‌కుమార్, శాస్త్రవేత్త