నిజామాబాద్ స్పోర్ట్స్/ ఖలీల్‌వాడి/ నిజామాబాద్ క్రైం, జనవరి 1 : ఆంగ్ల నూతన సంవత్సరానికి ప్రజలు ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఆదివారం అర్ధరాత్రి యువత పటాకులు కాల్చి, కేక్‌లు కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. ఈ ఏడాదంతా తమకు మంచి జరగాలని కోరుతూ సోమవారం ఉదయం ప్రజలు ఆలయాలకు తరలివెళ్లారు. దీంతో నగరంలోని పలు ఆలయాల్లో భక్తుల సందడి నెలకొన్నది.
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుకు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు సోమవారం కలెక్టరేట్లో ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది జిల్లా అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా అభివృద్ధికి అధికారులు, సిబ్బంది కలిసికట్టుగా కృషిచేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ జయరాం, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో డీసీపీకి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, జడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో చందర్, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, వినోద్‌కుమార్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, జిల్లాస్థాయి అధికారులు సింహాచలం, జయసుధ, యోహాన్, రమేశ్, డాక్టర్ సుదర్శన్, రవీందర్, వాజిద్ హుస్సేన్, టీఎన్జీవోస్ సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్, పెన్షనర్ల సంఘం, సీనియర్ సిటిజన్స్ సంఘం ప్రతినిధులు, లయన్స్ క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, తాహెర్‌బిన్ హందాన్ నేతృత్వంలో ఆఫీసర్స్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు, బాపూజీ వచనాలయం కమిటీ ఉన్నారు. స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య దివ్యాంగ విద్యార్థులతో కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలుపగా.. కలెక్టర్ కేక్ కట్ చేసి విద్యార్థులకు తినిపించారు.
తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే వారు పూల బొకేలకు బదులుగా నోట్‌బుక్కులు, దుప్పట్లు, పెన్నులను అందజేయాలని కలెక్టర్ ముందుగానే సూచించారు. దీనికి విశేష స్పందన లభించింది. దీంతో అధికారులు, సిబ్బంది, ప్రముఖులు, వివిధ సంఘాల వారు కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపి పెద్ద సంఖ్యలో దుప్పట్లు, నోట్‌బుక్కులు, పెన్నులను అందజేశారు. కలెక్టర్ వీటిని సంక్షేమ వసతిగృహాల విద్యార్థులకు అందజేయాలని ఆదేశిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర శాఖ అధికారులకు అందజేశారు. స్నేహ సొసైటీ పాఠశాలలోని దివ్యాంగులకు సైతం వీటిని అందజేశారు.
నిజామాబాద్ కల్చరల్/ నిజామాబాద్ రూరల్/ ఇందల్వాయి, జవవరి 1 : నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా సోమవారం ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. ఈ ఏడాదంతా తమకు మంచి జరగాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా కేంద్రంలోని ఉత్తర తిరుపతి క్షేత్రం, నీలకంఠేశ్వరాలయం, జెండా బాలాజీ ఆలయం, మార్కండేయ ఆలయం, గాయత్రీ మాత ఆలయం, సుభాష్‌నగర్ రామాలయం, శివారులోని సారంగపూర్ హనుమాన్ ఆలయం, మాధవనగర్ సాయిబాబా తదితర ఆలయాల్లో భక్తుల సందడి నెలకొన్నది. డిచ్పల్లి మండలంలోని ధర్మారం(బీ), బర్ధిపూర్, ఇందల్వాయి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని చర్చి, వినాయక్‌నగర్‌లోని ఫెయిత్ బాప్టిస్ట చర్చిలో రెవరెడ్ అబ్రహం, పాస్టరమ్మ రేచల్ ఆధ్వర్యంలో క్రీస్తు సందేశాన్ని వినిపించారు.
బోధన్/ఆర్మూర్‌టౌన్/మాక్లూర్, జనవరి 1: నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా బోధన్ పట్టణంలోని చక్రేశ్వర శివమందిరానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అభిషేకాలు, అన్నపూజ, మహా హారతి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్మూర్ నవనాథ్ సిద్దుల గుట్టపై ఉన్న శివాలయం, మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లిలోని అపురూప వేంకటేశ్వర ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించారు. మాక్లూర్ మండలంలోని మానిక్‌బండార్, క్రీస్తునగర్, బోర్గాం(కె), జ్యోతినగర్, గద్వాల క్యాంపు , ఆర్మూర్ మండలంలోని పిప్రిలో ఎల్ షద్దాయ్ చర్చిలో క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. కేకును కట్ చేసి పంపిణీ చేశారు. నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 1 : న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31న నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని మూడు డివిజన్లలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో ఏసీపీల పర్యవేక్షణలో 32 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, నాలుగు స్పెషల్ పార్టీ బృందం, సివిల్ సిబ్బంది మొత్తం 750 మంది ఆధ్వర్యంలో బందోబస్తు, డ్రంక్ అండ్ డ్రైవ్, మొబైల్ పెట్రోలింగ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 79 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.