చందూర్, ఫిబ్రవరి 13: రేషన్ కార్డుల జారీ విషయంలో రేవంత్ ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తున్నది. కొత్త కార్డులు ఇచ్చిందీ లేదు.. పాత వాటిలో మార్పులు చేసిందీ లేదు. కేవలం దరఖాస్తుల స్వీకరణకే పరిమితమవుతున్నది. తాజాగా మీసేవ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించడంతో జనం అటువైపు పరుగులు పెడుతున్నారు. పనులు మానుకుని పొద్దంతా పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు ప్రజాపాలన దరఖాస్తుల సమయంలో, గ్రామసభల్లో అప్లికేషన్లు పెట్టుకున్నారు. పలుమార్లు ఐప్లె చేసినా ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. దీంతో జనం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఆ పార్టీ నేతలు ఎన్నికల ముందు ఊదరగొట్టారు. 15 నెలలు దాటుతున్నా కొత్త కార్డులు మాత్రం ఇవ్వలేదు. పైగా ప్రజల నుంచి తరచూ అప్లికేషన్లు తీసుకుంటూ చివరకు వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం ప్రజాపాలన, గ్రామసభలు ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించింది. కానీ సదరు దరఖాస్తులను పరిశీలించి దాఖాలాలు లేవనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సంబంధిత మంత్రి రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని చెప్పినా..ఇప్పటి వరకూ ఒక్క రేషన్‌కార్డు జారీ చేయకపోవడం గమనార్హం. కొత్త రేషన్‌కార్డు, మార్పులు, చేర్పులతోపాటు సవరణల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఇటీవల ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీంతో పౌర సరఫరాల శాఖ, మీ సేవ కేంద్రాలకు ప్రజలు పరుగులు తీస్తున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవ కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు. పనులన్నీ వదులకొని ఉదయం నుంచే బారులు తీరుతున్నారు
రేషన్ కార్డు వస్తదేమోననే ఆశతో కొందరు పలు దఫాలుగా దరఖాస్తు చేసుకుంటున్నారు. దరఖాస్తులతోపాటు ఆధార్‌కార్డు జిరాక్స్ కాపీలను జతచేస్తున్నారు. త్వరలో రేషన్‌కార్డులను జారీ చేస్తామని ప్రభుత్వం, సంబంధిత మంత్రి ప్రకటించిన ప్రతిసారి తాము దరఖాస్తు చేసుకుంటున్నా, ప్రయోజనం లేకుండా పోతున్నదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. గతంలో రేషన్‌కార్డు కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే ఫీల్డ్ వెరిఫికేషన్ నుంచి మొదలుకొని డీఎస్వో వరకు ఆన్లైన్లో స్టేటస్ అందుబాటులో ఉంచేవారు. సివిల్‌సప్లయ్ వెబ్సైట్లో కూడా తెలుసుకునే అవకాశం ఉండేది. ఒక్కసారి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే మళ్లీ అప్లయ్ చేసుకోవడానికి అవకాశం ఉండేదికాదు. దీంతో స్టేటస్ రూపంలో మాత్రమే రేషన్‌కార్డు మంజూరు జారీ ప్రక్రియను తెలుసుకునేవారమని పలువురు గుర్తుచేసుకుంటున్నారు.
ప్రజాపాలన, గ్రామసభల్లో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారు ప్రభుత్వ అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తున్నది. ఎప్పుడు మంజూరుచేస్తారని దరఖాస్తుదారులు అడిగితే సమాధానం చెప్పేవారే కరువయ్యారు.అసలు రేషన్ కార్డులు ఇస్తారా..ఇస్తే ఎప్పుడు ఇస్తారు..లేదా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెబుతారా..ఇంకెన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలి..ఇలాగా ఆఫీసు చుట్టూ తిరగాల అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రేషన్‌కార్డుల మంజూరుపై కనీసం స్టేటస్ అయినా చెప్పాలని కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ నుంచి దఫదఫాలుగా దరఖాస్తులు తీసుకోవడమే తప్ప, రేషన్‌కార్డులు ఇచ్చిందిలేదు..సచ్చిందిలేదంటూ నిట్టూరుస్తున్నారు.