బోధన్, సెప్టెంబర్ 12 : ‘ఇదిగో రాయలసీమ.. అది గో రాయలసీమ..’ అంటూ ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న బోధన్ ప్రజల కలనెరవేరలేదు సరికదా.. బోధన్ రైల్వే స్టేషన్ నుంచి ఎన్నో దశాబ్దాలుగా నడిచే రైళ్లు కూడా రద్దయ్యాయి. దీంతో రద్దయిన రైళ్ల పునరుద్ధరణ కోసం.. నిజామాబాద్ – తిరుపతి మధ్య నడుస్తున్న రాయలసీమ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పొడిగింపు కోసం బోధన్‌లో విద్యార్థిసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాలు జరిగాయి. నిత్యం గూడ్స్ రైళ్లు జోరుగా నడుస్తున్నా నిజామాబాద్-బోధన్ రైల్వేలైన్‌లో ప్రయాణికుల కోసం ఒక్క రైలు కూడా నడపకపోవడమేమిటని ప్రశ్నిస్తు న్నారు. దీంతో కంటితుడుపు చర్యలు మొదలయ్యాయి.. ఐదు నెలల కిందట మహబూబ్‌నగర్ – బోధన్ ప్యాసింజర్ రైలును పునరుద్ధరించారు. అయితే, ఈ రైలు తెల్లవారకముందే బోధన్ నుంచి బయల్దేరి, ఎప్పుడో అర్థరాత్రి తర్వాత బోధన్‌కు చేరుకుంటుంది.
బోధన్ ప్రాంత ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ రైలు సమయాలు మార్చకపోవడంతో ఈ ప్రాంతానికి ప్రయోజనం లేకుండాపోయింది. ఇక, నాలుగేండ్ల కిందట రద్దయిన బోధన్-కామారెడ్డి- మిర్జాపల్లి ప్యాసింజర్ రైలును ఇంతవరకు పునరుద్ధరించలేదు.. కోట్లాది రూపాయలతో బోధన్-నిజామాబాద్ రైల్వేమార్గంలో ఎలక్ట్రిఫికేషన్ పనులు జరుగుతుంటే.. ఇదంతా తమ అవసరాలను తీర్చడం కోసమేనని సంబురపడ్డ బోధన్ ప్రాంతం ప్రయాణికులకు నిరాశే ఎదురైంది. సరుకుల రవాణా కోసమే ఇదంతా జరిగిందన్న రైల్వేశాఖ ఉద్ధేశం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నది. ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్ ఫలితంగా ఈ ఏడాది జూన్ 23 నుంచి రాయలసీమ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్స్‌ను ప్రారంభించారు. ట్రయల్స్ అంటే రెండుమూడురోజులు.. మహా అంటే ఓ పది రోజులపాటు చేస్తా రు.. ఇక్కడ అలా కాకుండా రెండున్నర నెలలుగా ట్రయల్స్ కొనసాగుతున్నాయి. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ తిరుపతి నుంచి ప్రతి రోజూ ఉద యం 8.30 నిజామాబాద్‌కు చేరుకున్న తర్వా త..అక్కడి నుంచి ఖాళీ బోగీలతో బోధన్‌కు రావ డం..మళ్లీ ఖాళీ బోగీలతో నిజామాబాద్‌కు వెళ్తున్న ది. ఖాళీ బోగీలతో ఆ రైలును నడపుతున్నారే తప్ప ప్రయాణికులను అనుమతించడంలేదు.. బోధన్‌లో క్లీనింగ్ తప్ప మరేమీ జరగడంలేదు.. ఇదంతా ఇలా ఉంటే.. ఇటీవల బోధన్‌కు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం శరత్ చంద్రయాన్ కూడా రాయలసీమ ఎక్స్‌ప్రెస్ పొడిగింపు విషయమై కచ్చితమైన ప్రకటన చేయకపోవడం గమనార్హం. విద్యార్థి సంఘాల రైల్వే జేఏసీ ఈ విషయమై ఆయన్ని ప్రశ్నించగా, రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపామంటూ ముక్తసరిగా సమాధానమిచ్చారు. దీంతో రాయలసీమ ఎక్స్‌ప్రెస్ పొడిగింపు విషయమై స్థానికుల్లో నెలకొన్న అనుమానాలు తొలగిపోలేదు.
రైల్వేశాఖకు మంచి ఆదాయం తీసుకువస్తున్న రైల్వే స్టేషన్లలో బోధన్ ఒకటి.. బోధన్‌లో కేంద్ర గిడ్డంగుల సంస్థకు చెందిన గోదాముల సామర్థ్యం తెలంగాణ రాష్ట్రంలో రెండు లేదా మూడో స్థానంలో ఉంటుంది. ఇక్కడి నుంచి అనేక రాష్ర్టాలకు నేరుగా ధాన్యం రవాణా జరుగుతుంది. బోధన్ నుంచి జరిగే గూడ్స్ వ్యాగన్ల రూపేణా రైల్వేశాఖకు ప్రతి ఏటా రూ.30 నుంచి 35 కోట్ల మేర ఆదాయం వస్తున్నదని అంచనా.. ఇంత పెద్ద ఎత్తున ఆదా యం వస్తున్పప్పటికీ ఈ లైన్‌పై రైల్వేశాఖ మొదటినుంచీ నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడం గమనార్హం.. భవిష్యత్తులో కూడా సరుకుల రవాణా ద్వారా వచ్చే ఆదాయంపైన ఉన్న శ్రద్ధ ప్రయాణి కుల సౌకర్యాలపైన లేదన్న విషయం ఇటీవల దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం శరత్ చంద్రయాన్ బోధన్‌కు వచ్చిన సందర్భంగా బహిర్గతమైంది. ఇప్పటివరకు బోధన్ నుంచి బియ్యం ఎగుమతులే జరుగుతున్నాయని, బోధన్‌కు ఇకపై సిమెంట్, ఎరువుల సరఫరా వ్యాగన్ల ద్వారా చేస్తే.. ఆదాయం మరింతగా పెరుగుతుందన్న ఆలోచనలో రైల్వేశాఖ ఉంది. ఈ ఆలోచన మేరకే డీఆర్ఎం బోధన్‌లో ఎరువులు, సిమెం ట్ కంపెనీ డీలర్లు, హమాలీల కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో ప్రయాణికుల సౌకర్యాలు గురించి, కొత్త రైళ్లను నడిపే విషయంపై ఎటువంటి నిర్ణయాలు ప్రకటించలేదు.
బోధన్ రైల్వేమార్గంలోని శక్కర్‌నగర్, ఎడపల్లి రైల్వే స్టేషన్లను ఏడాది కిందట రైల్వేశాఖ మూసివేసింది. నిజాం కాలం నుంచి ఉన్న ఈ రెండు రైల్వే స్టేషన్లను మూసివేయడంతో ప్రస్తుతం నడుస్తున్న ఏకైక రైలును సైతం ప్రయాణికులు ఉపయోగించుకోలేకపోతున్నారు.ఇప్పుడు వాటిని శాశ్వతంగా మూసివేయడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.
బోధన్‌లోని మరో రైల్వే స్టేషన్ గాంధీ పార్కు స్టేషన్ అధ్వానంగా మారింది. ప్రయాణికుల రైళ్లు తిరగకపోవడంతో ఈ స్టేషన్ పోకిరీలకు అడ్డాగా మా రింది. టిక్కెట్ల బుకింగ్ రూమ్‌తో పాటు ప్లాట్‌ఫా రం అధ్వానంగా మారింది. ప్లాట్ఫారం ఎత్తు పెం చేందుకు అప్పటికే ఉన్న ప్లాట్‌ఫారాన్ని తవ్వేశారు. దీంతోఇక్కడ రైలెక్కడం మాటెలా ఉన్నా.. కనీసం నిలబడడానికి కూడా ఇబ్బందిగా మారింది.
సుమారు 80 సంవత్సరాలుగా కాగితాలకే పరిమితమైన బోధన్ – బీదర్ రైల్వే లైన్ నిర్మాణం నేటికీ ప్రారంభంకాలేదు. 2010 రైల్వే బడ్జెట్లో ఈ రైల్వే లైన్ నిర్మాణం మంజూరైంది. 2014 నాటికి రైల్వేలైన్ సర్వే పూర్తయింది. అయితే, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ రైల్వేలైన్ నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు..
బోధన్ రైల్వేమార్గంలో మరిన్ని రైళ్లను ప్రవేశపెట్టాలని, బోధన్‌కు ట్రయల్స్ పేరిట నడుపుతున్న రా యలసీమ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులను అనుమతించాలని డిమాండ్ చేస్తూ మరోసారి ఆందోళనకు ఇక్కడి విద్యార్థులు, యువకులు సిద్ధమవుతున్నారు. కొన్నేండ్లుగా బోధన్ రైల్వేమార్గం సమస్యలపై పోరాటం చేస్తున్న విద్యార్థి సంఘాల రైల్వే జేఏసీ నాయకులు రైల్వేశాఖపై ఒత్తిడిని పెంచేవిధంగా కార్యాచరణ చేపడుతున్నారు.
బోధన్ రైల్వేలైన్‌పై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ నిర్లక్ష్యం చూపుతున్నారని బోధన్ ప్రాంతం ప్రయాణికులు మండిపడుతున్నారు. తాము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, రైల్వే సమస్యల పరిష్కారం విషయమై స్పందించడంలేదని పలువురు ఎంపీ అర్వింద్ తీరును తప్పుపడుతున్నారు. బోధన్ రైల్వేమార్గంలో నిజాం కాలం నుంచి ఉన్న రెండు రైల్వే స్టేషన్లను మూసివేసినప్పటికీ, ఎంపీ అర్వింద్ నోరు మెదపలేదు.. ఎంపీ అర్వింద్ అంతులేని నిర్లక్ష్యం కారణంగానే బోధన్ రైల్వేలైన్‌కు దుస్థితి పట్టిందని పలువురు అంటున్నారు.
బోధన్ రైల్వేలైన్‌లో రైళ్లను నడపకపోవడంతో ఈ ప్రాంతం ప్రజలు ఎంతో నష్టపోతున్నారు.. సరుకుల రవాణా ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ, ప్రయాణికుల అవసరాలను పట్టించుకోవడంలేదు. బోధన్ నుంచి నిజామాబాద్‌కు, తెలంగాణ యూనివర్సిటీకి ప్రతినిత్యం వందలాది మంది విద్యార్థులు వెళ్తుంటారు. వారికి రైల్వే సౌకర్యం ఉంటే ఎంతో బాగుంటుంది. రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను ప్రయాణికుల కోసం పొడిగించాలి. అలాగే, పగటిపూట మరికొన్ని రైళ్లను నడపాలి. ఇందుకోసం స్థానికులు, అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి పోరాటం చేస్తాం..
– గౌతమ్‌కుమార్, విద్యార్థి సంఘం నాయకుడు, బోధన్