మాక్లూర్, జనవరి 6: మండలంలోని చిన్నాపూర్ వద్ద అర్బన్ పార్కును కలెక్టర్ నారాయణరెడ్డి శుక్రవారం సందర్శించారు. చివరి దశకు చేరిన వివిధ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాన రహదారి నుంచి అర్బన్ పార్కు మెయిన్ గేటు వరకు ఇరువైపులా పూలమొక్కలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం చేయొద్దని అన్నారు. మెయిన్ రోడ్డు మీదుగా రాకపోకలు సాగించే వారికి కూడా అర్బన్ పార్కు ఆకర్షించేలా వేయించాలన్నారు. త్వరగా పనులు పూర్తి చేసి అర్బన్ పార్కును ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా అటవీశాఖ అధికారి వికాస్ మీనా, ఎఫ్‌డీవో భవానీ శంకర్, ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్, హిమచందన, మాక్లూర్, డిచ్పల్లి ఎంపీడీవోలు క్రాంతి, గోపి తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్, జనవరి6: అంకాపూర్ గ్రామంలోని అవెన్యూ ప్లాంటేషన్‌ను కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. వరి నాట్లు వేస్తున్న రైతులను కలెక్టర్ పలకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఉప సర్పంచ్ కిశోర్‌రెడ్డి, అధికారులు ఉన్నారు.